
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని సీతారాంపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ధర్మవరం రూరల్ పోలీసులు 170.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందడంతో ధర్మవరం రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు, సీఎస్‌డీటీ కేశవనాయుడు, వీఆర్‌ఓ, పోలీస్ సిబ్బంది సోమవారం ఉదయం సీతారాంపల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనంతపురం వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఐచర్‌ను నిలిపి తనిఖీ చేశారు. అందులో 341 బ్యాగుల (170.50 క్వింటాళ్లు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. ఐచర్ వాహన డ్రైవర్, బుక్కపట్నం మండలానికి చెందిన గుజ్జల సతీష్‌ని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అలాగే సోమందేపల్లికి చెందిన నరేష్, చెన్నేకొత్తపల్లికి చెందిన సద్దాం ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.