మాటలు జాగ్రత్త సునీతమ్మా | - | Sakshi
Sakshi News home page

మాటలు జాగ్రత్త సునీతమ్మా

Aug 4 2025 3:30 AM | Updated on Aug 4 2025 3:30 AM

మాటలు జాగ్రత్త సునీతమ్మా

మాటలు జాగ్రత్త సునీతమ్మా

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు చేపట్టిన హంద్రీ–నీవా కాలువ కాంక్రీట్‌ లైనింగ్‌ పనులతో 2 లక్షల ఎకరాలకు పైగా భూములు బీడుగా మారబోతున్నాయిు. 40–50 వేల రైతు కుటుంబాలను నేల కూల్చుతున్నావు. శత్రువులతో నీ భర్త ఫ్యాక్షన్‌ చేసి ఉండొచ్చుకాని నువ్వు మాత్రం తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తున్నావు. నీ కంటే నీ భర్త పదిరెట్లు మేలని మీ పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాప్తాడు నియోజక వర్గంలో వేలాదిమంది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత హత్యలు, దాడులు, అక్రమ కేసుల బాధిత కుటుంబాలవారు తరలి వచ్చారన్నారు.

ఏరోజైనా రాత్రిపూట నీ భర్త నిద్రపోయాడా?

‘నీభర్త పేరు చెబితేనే భయపడతామని చెబుతున్నావు... 1998–99లో నీ భర్త ఏరోజైనా రాత్రిపూట నిద్రపోయాడా?’ అని ప్రకాష్‌ రెడ్డి ప్రశ్నించారు. ఎవరిని కలవరించుకుంటూ భయపడేవాడో ఆమెకే తెలియాలన్నారు. ‘అరవిందనగర్‌లో మా ఇంటికి వంద అడుగుల దూరంలోనే నీ భర్త ఇల్లు కట్టాడు. నీ భర్తపై యుద్ధం చేసి 30 నెలలు నేను జైలు జీవితం గడిపా. నా తండ్రి అదే ఇంట్లోనే కాపురం ఉన్నాడు. నీ మొగుడు చనిపోయిన తర్వాత ఆ ఇంటినుంచి పక్కకు పోయాం. నువ్వేమో నీ భర్త గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆయన తమ్ముడిని పోలీసులు చంపితే తోపుదుర్తి రాంభూపాల్‌రెడ్డి వద్దకు వెళ్లి...‘పెద్దాయనా నేను గొర్లు కాసుకునేవాడిని. నాకు ఏ రాజకీయం వద్దు. నన్ను వదిలిపెట్టమని మద్దెలచెరువు నారాయణరెడ్డికి చెప్పు’ అని బతిమాలలేదా? ఇదీ మీ ఆయన చరిత్ర’ అన్నారు.

ఆర్‌ఓసీతో ఊచకోత కోయించారు..

పరిటాట రవి మంత్రిగా ఉన్నప్పుడు ఆర్‌ఓసీ అనే ప్రైవేట్‌ క్రిమినల్‌ సంస్థను ఏర్పాటు చేసుకుని ఊచకోత కోయించారని ప్రకాష్‌ రెడ్డి దుయ్యబట్టారు. ‘నీ మొగుడిని చంపిన మద్దెలచెరువు సూరి కాళ్లు పట్టుకుని నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2009 తర్వాత నీ రాజకీయ జీవితం మద్దెలచెరువు సూరి పెట్టిన భిక్ష. సూరి వద్దకు మీ బంధువులను పంప లేదా? మీ ఆయన హత్య కేసు ముద్దాయిలతో నువ్వు సయోధ్య కుదుర్చుకోలేదా? మద్దెలచెరువు సూరి శిష్యుడు శివలింగకు నీ తమ్ముడు బాలాజీ రూ. 5 లక్షలు ఇచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేయించలేదా?మరో శిష్యుడు భానును ఉపయోగించుకోలేదా?ఇదీ మీ అసలు చరిత్ర. పవర్‌లో ఉంటే జుట్టు పట్టుకుంటావు. లేకపోతే మరోలా వ్యవహరిస్తావు. మీ వద్ద ఎంపీపీగా పని చేసిన దగ్గుపాటి ప్రసాద్‌ ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకోగలిగితే నీ కుమారుడికి ధర్మవరం టికెట్‌ తెప్పించుకోలేకపోయావు. ఇదీ మీ చరిత్ర. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నావు... ప్రకాష్‌రెడ్డిని జైలుకు పంపాలంటే నీకు రూలింగ్‌ కావాలేమో. ప్రకాష్‌రెడ్డి జైలుకు వెళ్లేందుకు ఏ రూలింగ్‌ అవసరం లేదు. 20 ఏళ్లు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం’ అన్నారు.

వేల కుటుంబాలు వీధులపాలు..

రాష్ట్రంలో రాక్రీట్‌ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను ఆపేసి వేల కుటుంబాలను వీధులపాలు చేశారని ప్రకాష్‌ రెడ్డి విమర్శించారు. ‘ఆలమూరు, కొడిమి జగనన్నకాలనీల్లో 10 వేల మందికి ఇళ్లు నిర్మించే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారు. పాపంపేట వద్ద ఇళ్లు కూల్చేయించావు. అప్పటి నుంచి 110 ఎకరాల శోత్రియం భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారందరూ భయపడుతున్నారు. అందుకే నీ భర్త కంటే కూడా నువ్వంటేనే భయపడుతున్నారు. మళ్లీ అధికారంలోకి రామనే తెలుసు కాబట్టే అందినకాడికి దోచుకుంటున్నారు. ఎవరూ మీ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, వైస్‌ ఎంపీపీ రామాంజనేయులు, నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, బండి పవన్‌, గోవిందరెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, జూటూరు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిన్ను చూసి మీ పార్టీ వాళ్లు,

మీ కులం వాళ్లే భయపడుతున్నారు

1998–99లో నీ భర్త ఏరోజైనా రాత్రిపూట నిద్రపోయాడా?

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement