
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
అనంతపురం మెడికల్: ఓ డాక్టర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది.కుటుంబీకులు, బంధువులకు తీరని శోకం మిగిల్చింది. గైనకాలజిస్టు చేయాల్సిన శస్త్రచికిత్సను ఓ సర్జన్ చేయడంతో అధిక రక్తస్రావం జరిగి చివరకు గర్భిణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైద్యుడి నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబీకులు ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వివరాలు... బుక్కరాయసముద్రం మండలం చదళ్లకు చెందిన మల్లికార్జున, రాధమ్మ (29) దంపతులకు అమల, సాయి సంతానం. రాధమ్మ మరోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఐదో నెల. గర్భంలోని బిడ్డ విషయంలో సమస్య తలెత్తడంతో ఇటీవల నగరంలోని ఓ గైనకాలజిస్టును సంప్రదించారు. అయితే, శస్త్రచికిత్స చేయడానికి గైనకాలజిస్టు నిరాకరించారు. దీంతో ఈ నెల ఒకటో తేదీన నగరంలోని సాయికృప ఆస్పత్రికి మల్లికార్జున, రాధమ్మ వెళ్లారు. అక్కడ ఆమెకు డాక్టర్ వెంకటరమణ నాయక్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, జీజీహెచ్) కొన్ని మందులిచ్చి ఆదివారం రమ్మన్నారు. దీంతో రాధమ్మ ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఆస్పత్రికి రాగా, గంట వ్యవధిలోనే గర్భసంచి తొలగించాలంటూ డాక్టర్ వెంకటరమణ నాయక్ ఆపరేషన్ ప్రారంభించారు. కాసేపటికే అధిక రక్తస్రావం జరిగి రాధమ్మ ప్రాణాలు విడిచింది.
బంధువుల ధర్నా..
వైద్యుడి నిర్లక్ష్యంతోనే రాధమ్మ మృతి చెందిందంటూ కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వైద్యుడిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనుపమజేమ్స్ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. గైనకాలజిస్టు చేయాల్సిన సర్జరీ మీరెందుకు చేశారని డాక్టర్ వెంకటరమణ నాయక్‌ను ప్రశ్నించగా.. ఆయన నీళ్లు నమిలారు. అనంతరం ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ సీజ్ చేశారు.
అనుమతులు తిరస్కరించినా..
ఏడాది క్రితం కూడేరుకు చెందిన ఓ మహిళా రోగి ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చారు. ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి శ్రీనివాస్‌నగర్‌లోని లావణ్య హాస్పిటల్ (ప్రస్తుత సాయికృప ఆస్పత్రి) లో సర్జరీ చేయగా.. అది కాస్తా వికటించింది. చివరకు ఆమె కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు చేయగా కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాలతో ఆస్ప త్రిని అప్పట్లో సీజ్ చేశారు. ఇటీవల అదే చోట సాయికృప పేరున ఆస్పత్రికి దరఖాస్తు చేసుకోగా ఆరోగ్యశాఖాధికారులు తిరస్కరించారు. అయినా, గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రి నడుపుతూ శస్త్రచికిత్సలు ప్రారంభించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
తల్లి లేని బిడ్డలై..
రాధమ్మ మృతితో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లిలేని వారయ్యారు. ఆస్పత్రిలో తల్లికి ఏం జరిగిందో తెలియక ‘అమ్మా..అమ్మా’ అంటూ వారు అంటుండం అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది.

నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి