
నాసిరకం విత్తనంతో నష్టపోయాం
● ఫర్టిౖలైజర్ షాప్ ఎదుట రైతుల ధర్నా
కళ్యాణదుర్గం రూరల్: నాసిరకం విత్తనంతో నష్టపోయినట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గంలోని అన్నదాత ఫర్టిలైజర్ షాప్ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. శెట్టూరు మండలం మాలేపల్లి గ్రామానికి చెందిన 20 మంది రైతులు కళ్యాణదుర్గంలోని అన్నదాత ఫర్టిలైజర్ షాప్‌లో మొక్కజొన్న విత్తనాలు తీసుకుని, సాగు చేపట్టినట్లు తెలిపారు. పంట కాలం పూర్తయిన తర్వాత దిగుబడి తామే కొనుగోలు చేస్తామంటూ రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశారన్నారు. ఆ తర్వాత పెట్టుబడి, మందుల కోసం ఒక్కొక్క రైతు నుంచి రూ.70 వేలు వసూలు చేసుకున్నారని వివరించారు. అయితే ఫర్టిలైజర్ నిర్వాహకులు నాసిరకం విత్తనం ఇవ్వడంతో పంట పూర్తిగా ఎత్తిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని పలుమార్లు ఫర్టిలైజర్ నిర్వహకులకు తెలిపిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. దీంతో పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ శుక్రవారం ఫర్టిలైజర్ షాప్ ఎదుట నిరసన చేపడితే.. యజమాలు దుకాణాన్ని మూసి అజ్ఞాతంలోకి వెళ్లారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న వ్యవసాయాధికారులు అక్కడకు చేరుకుని బాధిత రైతులతో మాట్లాడారు. ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులతో మాట్లాడి.. రైతులకు న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.