
భారీగా పడిపోయిన వేరుశనగ సాగు
● 1.82 లక్షల హెక్టార్ల అంచనా వేస్తే 40 వేల హెక్టార్లకే పరిమితం
● తీవ్రవర్షాభావం, ‘కూటమి’ సాయం లేకపోవడమే కారణం
అనంతపురం అగ్రికల్చర్: ప్రధాన పంటగా దశాబ్దాల పాటు పేరుగాంచిన వేరుశనగ సాగు ఈ సారి కనిష్ట స్థాయికి పడిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కూటమి సర్కారు సకాలంలో నాణ్యమైన విత్తనం ఇవ్వకపోవడం, పెట్టుబడి సాయం అందించకపోవడం తదితర కారణాలతో వేరుశనగ పంట సాగకు రైతులు ముందుకు రాలేదు. దీంతో ఈ ఖరీఫ్‌లో 1.82 లక్షల హెక్టార్లుగా అంచనా వేసినా... చివరకు 40 వేల హెక్టార్ల వద్ద నిలిచిపోయింది. ఇందులోనూ చాలాచోట్ల నీటి వసతి కింద సాగు చేశారు. ఇక పంట విత్తుకునే సమయం జూలై నెలాఖరుతో ముగియడంతో సీజన్ ముగిసేలోపు వేరుశనగ సాగు 50 వేల హెక్టార్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాధారంగా విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయినట్లు చెబుతున్నారు.
దెబ్బతీసిన జూలై వర్షాలు..
సాధారణంగా ఖరీఫ్‌లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూలై నెల మంచి అదను. అయితే జూలైలో వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్ ఏరువాకపై తీవ్ర ప్రభావం చూపింది. జూలైలో 64.3 మి.మీ గానూ 34.5 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణం కన్నా 46.2 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. జూన్‌లో కూడా 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. ఇలా సీజన్ ప్రారంభమైన కీలకమైన మొదటి రెండు నెలల్లోనే 125.5 మి.మీ గానూ 35 శాతం తక్కువగా 82.4 మి.మీ వర్షపాతం నమోదు కావడం ప్రధాన పంటల సాగుకు అవరోధంగా మారింది. కణేకల్లు, కుందుర్పిలో మాత్రమే సాధారణం కన్నా కాస్త అధికంగా వర్షాలు కురిశాయి. ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా 23 మండలాల్లో వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. 10 మండలాల్లో అయితే సాధారణం కన్నా 50 నుంచి 70 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.
ఇక ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం..
ఈ ఖరీఫ్‌లో 3,42,232 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణంగా అంచనా వేయగా ఇప్పటి వరకు 1.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చి ఉంటాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇంకా 2 లక్షల హెక్టార్ల వరకు భూములు బీళ్లుగానే ఉంటాయి. ప్రతి శనివారం మండలాల నుంచి సాగు విస్తీర్ణం గణాంకాలు సేకరిస్తున్నారు. ఆగస్టులో వేరుశనగ సాగు చేయకూడదని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఆగస్టు 15 వరకు కంది, ఆముదం, పత్తి, కొర్ర, సజ్జ విత్తుకోవచ్చని సూచించారు. ఆగస్టు 15 తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెలిపారు. సాగు గడువు ముగియడంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికపై దృష్టి సారించారు. మండలాల నుంచి విత్తన ప్రతిపాదన నివేదికలు తీసుకుంటున్నారు.