
అమలు చేత కానప్పుడు హామీ ఎందుకిచ్చారు?
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
గుంతకల్లు: ఆడబిడ్డ నిధి పథకం అమలు చేతకానప్పుడు ఎన్నికల సమయంలో హామీని ఎందుకు ఇచ్చారంటూ కూటమి ప్రభుత్వ పెద్దలను కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. గుంతకల్లులోని మస్తానయ్య స్వామిని బుధవారం ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని సాయినగర్‌లోని తన స్వగ్రహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంట్లో ఎంత మంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద రూ.1,500 ఇస్తామంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ సంతకం చేసిన బాండ్ పేపర్లను ఇంటింటికీ పంచారని గుర్తు చేశారు. ఈ హామీని అమలు చేయాలంటే రాష్ట్రాన్నే అమ్మేయాల్సి వస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయన్నారు. దీనిని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం మాటపై నిలబడేది కాదని స్పష్టమైదన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ అధికారం చేపట్టిన తర్వాత అత్యంత పారదర్శకంగా అమలు చేశారని గుర్తు చేశారు. కరోనా విపత్కర సమయంలోనూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎక్కడేగాని ఆపలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పథకం కింద 87 లక్షల మంది అర్హులకు గాను 35 లక్షల మందికి మొండిచెయ్యి చూపారన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు.
31లోపు పంటల బీమా
ప్రీమియం చెల్లించండి
● రైతులకు జేడీఏ ఉమామహేశ్వరమ్మ సూచన
ఉరవకొండ: జిల్లాలో ఖరీఫ్ కింద పంటలు సాగుచేసిన రైతులు ఈ నెల 31వ తేదీలోపు పంటల బీమా ప్రీమియంను చెల్లించాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఉరవకొండ మండలం చిన్నముష్టూరు, పెద్దముష్టూరు గ్రామాల్లో ఈ–క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. మూలగిరపల్లిలో ఎన్‌ఎంఈఓ పథకం కింద వేరుశనగ విత్తనం సాగు చేస్తున్న పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. జిల్లాలో 60 వేల హెక్టార్లలో వేరుశనగ సాగులో ఉందన్నారు. అనంతరం వజ్రకరూర్ మండలం పీసీప్యాపిలిలో చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్స్ గ్రామంగా ఎంపికై న పీసీ ప్యాపిలీలో కేవీకే రెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రం ఆధ్వర్యంలో ఉచితంగా అందించిన కంది పీజీఆర్‌జీ 176 రకం విత్తనంతో సాగు చేసిన పంటను పరిశీలించారు. అనంతరం ఉరవకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటి వరకూ 40 శాతం తక్కవ వర్షపాతం నమోదైందన్నారు. రైతులు వేరుశనగ సాగు చేయడానికి వర్షం కోసం చూస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో ఉరవకొండ వ్యవసాయాధికారి రామకృష్టుడు, ఏఈఓలు పాల్గొన్నారు.

అమలు చేత కానప్పుడు హామీ ఎందుకిచ్చారు?