
నేతన్నలకు ఏదీ చేయూత?
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో నేతన్నలకు చేయూత కరువైందని ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే రూ.36 వేలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. చేనేత కార్మికులు, సొసైటీల విషయంలో కూటమి సర్కార్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్యాలయం వద్ద నాయకులు నిరసన తెలిపి అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, గోవిందు మాట్లాడారు. నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.24 ఇచ్చేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.36 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీ అమలు కాలేదని మండిపడ్డారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన హామీ మాటలకే పరిమితమైందన్నారు. చాలాచోట్ల విద్యుత్ లేక నేయర్లు, దర్జీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా చేనేత కార్మికులు ఉన్నప్పటికీ పాత బకాయిలు విడుదల చేయలేదన్నారు. సొసైటీలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. సొసైటీలను అడ్డుపెట్టుని అక్రమాలకు పాల్పడుతున్న అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రణాళికల్లో స్పష్టత లేకపోవడంతో కార్మికుల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు బకాయిలు చెల్లించాలన్నారు. సొసైటీలపై సమగ్ర విచారణ జరిపించి అవినీతిపరుల పేర్లను బహిర్గతం చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ సదుపాయం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై చేనేత కార్మిక సంఘం నాయకుల ధ్వజం