
యర్రగుంటపల్లిలో సినీ హీరో శ్రీకాంత్ సందడి
తాడిపత్రిటౌన్: తాడిపత్రి మండలంలోని యర్రగుంట పల్లిలో సినీ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు సందడి చేశారు. గ్రామంలో కొలువైన చౌడేశ్వరీ మాత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీకాంత్ దంపతులు విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. శ్రీకాంత్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అంతకుముందు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో శ్రీకాంత్, ఊహ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి చీర, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
క్రేజీ కంప్యూటర్ సైన్సెస్
● ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో సింహభాగం విద్యార్థుల మొగ్గు
అనంతపురం: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ (ఎంపీసీ స్ట్రీమ్) తొలి దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. కంప్యూటర్ ఆధారిత కోర్సులపైనే సింహభాగం విద్యార్థులు ఆసక్తి చూపించారు. జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్, ఎస్కేయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్సెస్ సీట్లు (స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా మినహా) అన్నీ భర్తీ అయ్యాయి. సీట్లు భర్తీ అయిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎస్‌ఆర్‌ఐటీ, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలు టాప్–2లో ఉన్నాయి. ఎస్‌ఆర్‌ఐటీలో ఈసీఈ142, సీఎస్‌ఈ 284, మెషీన్ లర్నింగ్ 142, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ 142 సీట్లు అన్ని బ్రాంచులు కలిపి 828 సీట్లు భర్తీ అయ్యాయి.అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ–218, సీఎస్‌ఈ–427, మెషీన్ లర్నింగ్ 220, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 48, డేటా సైన్సెస్ 47 మొత్తం అన్ని బ్రాంచులు కలిపి 990 సీట్లు భర్తీ అయ్యాయి.ఈ నెల 26లోపు కళాశాలల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా జలాలు
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాల చేరిక ప్రారంభమైంది. గురువారం స్థానిక రిజర్వాయర్ హెడ్ రెగ్యులేటరీ వద్ద హంద్రీ–నీవా సీఈ నాగరాజ, ఎస్‌ఈ రాజస్వరూప్‌కుమార్, ఈఈ శ్రీనివాసులు, డీఈఈ రామసుబ్బయ్య స్థానికులతో కలిసి కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీర, సారెను కృష్ణమ్మకు సమర్పించారు. కర్నూలు జిల్లాలోని మల్యాల నుంచి ‘అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి’ ప్రాజెక్టు కాలువలకు కృష్ణా జలాల పంపింగ్ ఈనెల 17న ప్రారంభించారు. ఇటీవల జిల్లాలోని రాగులపాడుకు జలాలు చేరుకున్నాయి. అక్కడి ఎనిమిదో నంబర్ పంపు హౌస్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోయడం బుధవారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నీరు జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చి చేరుతు న్నాయి. ప్రస్తుతం రాగులపాడు వద్ద నాలుగు పంపుల ద్వారా 1,100 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.