
ఎంఐజీలకు భూసేకరణ వేగవంతం చేయాలి
అనంతపురం అర్బన్: ఎంఐజీ లే అవుట్లకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అహుడా అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అహుడా చైర్మన్ టీసీ వరుణ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహుడా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెనుకొండ, ధర్మవరం, మడకశిర, గుత్తి, కూడేరు, కోడూరు, కందుకూరు ప్రాంతాల్లో లే అవుట్ల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. లే అవుట్ల కోసం గుర్తించే భూముల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. నివాసయోగ్యమై ఉండి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అనువుగా ఉండా లన్నారు. నగర, పట్టణ కేంద్రాలకు దగ్గరగా ఉండి అభివృద్ధి చేసేందుకు వీలుగా ఉన్న భూములను ఎంపిక చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. లే అవుట్లలో రోడ్లు, కాలువలు, ఇతర ప్రాథమిక సదుపాయాలతో ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసు కు రావాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.సమావేశంలో అహుడా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ప్లానింగ్ అధికారి ఇషాక్, ఈఈ దుష్యంత్, తదితరులు పాల్గొన్నారు.