
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు గడుస్తున్నా పథకాలను సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇది ముమ్మాటికీ దగా ప్రభుత్వం. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలకు మాత్రమే చంద్రబాబు పరిమితమయ్యారు. పీ–4 అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం అనంతపురం నగరంలోని 8వ డివిజన్‌లో ‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ ఏడాదిగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందో క్యూ ఆర్ కోడ్ సాయంతో ప్రజలకు ‘అనంత’ వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, వృద్ధులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌లో బియ్యం తూకం సరిగా ఇవ్వడం లేదంటూ వాపోయారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ‘తల్లికి వందనం’ పథకానికి 85 లక్షల మందికి అర్హత ఉంటే 65 లక్షల మందికి ఇస్తామని చెప్పారని, అందులోనూ ఇంకా లక్షల మందికి వర్తింపజేయలేదన్నారు. వైఎస్సార్ సీపీ పోరాటం కారణంగానే పథకం అమలు చేశారన్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాల్సిందేని, లేకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యులు రమేష్‌గౌడ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు అమర్‌నాథ్ రెడ్డి, చింతా సోమశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వెన్నం శివరామిరెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, రాజారెడ్డి, రాజగోపాల్, లక్ష్మణ్ణ, తనీష, సాకే శ్రీనివాసులు, దేవి, రవి, కార్పొరేటర్లు సుమతి, లక్ష్మి, దేవి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’
జగన్‌తోనే అన్నీ పాయే
జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్నీ ఇంటి వద్దకే వచ్చేవి. వలంటీర్లు ఉదయాన్నే పింఛన్ ఇచ్చే వారు. పథకాల గురించి ఎప్పటికప్పుడు చెప్పేవారు. సచివాలయాల్లో పని చేసే సిబ్బంది బాగా స్పందించేవారు. ఇంటికి పెద్దకొడుకులా జగన్ అన్నీ చేసేవాడయ్యా. రైతు భరోసా ఇప్పటికి రెండు సార్లు పడేది. జగన్ ప్రభుత్వం పాయె.. పథకాలన్నీ పాయె. బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఇంత కన్నా దారుణం ఎక్కడుంటుంది. గతంలో రేషన్ వాహనాల్లో ఇంటి వద్దకే వచ్చి అడిగి మరీ సరుకులు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు స్టోర్లు వచ్చాయి. రెండు కిలోమీటర్లు నడిచి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. మాకు నెలకు ఒక్కొక్కరికి 5 కేజీలు ఇవ్వాల్సి ఉంటే అందులో కేజీ కోత విధించి 4 కేజీలు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే రేషన్ డీలర్లు దౌర్జన్యం చేస్తున్నారు. – ‘అనంత’తో వృద్ధులు రత్నమ్మ, మెహరూన్‌బీ,
సాలమ్మ, బీబీజాన్