
ఉల్లి .. సాగు సన్నగిల్లి!
అంతర్జాతీయ వాణిజ్య పంటగా గుర్తింపు పొందిన ఉల్లి సాగు జిల్లాలో సన్నగిల్లుతోంది. వివిధ కారణాలతో ఉల్లి సాగుపై రైతులు ఆసక్తి కనపరచడం లేదు. ఖరీప్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా పది శాతం కూడా సాగులోకి రాకపోవడమే ఇందుకు నిదర్శనం.
రాయదుర్గం: జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో ఐదు వేల ఎకరాల్లో, మరి కొన్ని మండలాల్లో కొద్ది మేరకు రైతులు ఉల్లిని సాగు చేస్తున్నారు. ఇందులో ఒక్క గుమ్మఘట్ట మండలంలోనే రైతులు 2 వేల నుంచి 2,500 ఎకరాల్లో ఉల్లిని సాగు చేస్తున్నారు. ఆ తర్వాత వెయ్యి నుంచి 1,500 ఎకరాలతో బ్రహ్మసముద్రం, బెళుగుప్ప మండలాలు రెండో స్థానంలో నిలిచాయి. మరో 12 మండలాల్లో 2 వేల ఎకరాల్లో ఉల్లి సాగులో ఉంటోంది. అయితే ఈ సారి కనీసం 600 ఎకరాలు కూడా దాటని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పాటికి సుమారు 3 వేల ఎకరాలకు పైగా సాగు చేయాల్సి ఉండగా 10 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగులోకి వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉల్లి ధరలు ఆకాశానికి అంటడం ఖాయమనే వాదనలు వినవస్తున్నాయి. సాధారణంగా ఉల్లి సాగుకు ఎకరాకు ఐదు లేదా ఆరు కిలోల విత్తనాలు అవసరం కాగా, కిలో విత్తనం నాణ్యత ఆధారంగా రూ.1,800 నుంచి రూ.2,200 వరకు బయట మార్కెట్‌లో రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కలుపు ఇతర ఖర్చులు వెరసి ఎకరాకు ఎంత తక్కువన్నా రూ.50వేల నుంచి రూ.60 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీస పెట్టుబడులు కూడా చేతికి అందవనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది.
పెట్టుబడుల భారంతో చేతులెత్త్తేసిన రైతులు
రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో ఏటా ఉల్లి సాగు తగ్గుతూ వస్తోంది. లక్షల క్వింటాళ్ల దిగుబడి ఉన్న చోట ప్రస్తుతం వేళ్లతో లెక్కించే పరిస్థితి నెలకొంది. సారవంతమైన భూములు కావడంతో ఎకరాకు 300 నుంచి 350 ప్యాకెట్ల ఉల్లి పండించిన రైతులూ ఉన్నారు. క్వింటా రూ.2 వేలు ధర లభించినా రూ.2 లక్షల నుంచి రూ.2.20 లక్షలు చేతికి దక్కేది. పదెకరాల్లో సాగుచేసిన రైతు రూ.20 లక్షల నుంచి రూ.22 లక్షలకు పైగా ఆదాయాన్ని గడించారు. తాజాగా ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఉల్లి సాగుకు రైతులు మొగ్గు చూపడం లేదు. ఉల్లి విత్తనాలు రాయితీతో అందించడంలోనూ, కనీస మద్దతు ధర ప్రకటించడంలోనూ, సరైన మార్కెట్ సదుపాయం కల్పించడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పండించిన పంటను అమ్ముకోవాలంటే రాజమండ్రి, బెంగళూరు, పూణే లాంటి పెద్ద మార్కెట్లను రైతులు ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి తోడు కొత్త రకం తెగుళ్లు వెంటాడటం, సరైన అవగాహన లేక ఇష్టారీతిన పురుగు మందులు వినియోగిస్తుండడంతో పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో జిల్లా రైతులు చేతులు ఎత్తేయడంతో.. కర్ణాటకలో పండిస్తున ఉల్లిపైనే ఆధారపడాల్సి వస్తోంది.
గణనీయంగా తగ్గిన సాగు
రాయితీ విత్తనాలు అందించడంలో సర్కార్ విఫలం
మద్దతు ధర, మార్కెట్ సౌకర్యమూ కరువే