
టీచర్లకు హ్యాండ్ బుక్స్ సరఫరా
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి, పిల్లలకు పాఠాలను సులభంగా అర్థమయ్యేలా బోధించడానికి ఉపయోగపడే ‘హ్యాండ్ బుక్స్’ను శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి మండలాలకు సరఫరా చేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా సాధారణ పరీక్షల మండలి (డీసీఈబీ) ద్వారా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మండలాలకు తరలించారు. డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఒక సబ్జెక్టుకు ఒక బుక్ చొప్పున పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. ఎఫ్‌పీఎస్ 1, 2 తరగతుల స్కూళ్లకు 6 , 1–5 తరగతుల బీపీఎస్ స్కూళ్లకు 18, ఉన్నత పాఠశాలలు 6–10 తరగతులకు 33, ఉన్నత పాఠశాలలు 1–10 తరగతులకు 51 చొప్పున కేటాయించినట్లు శ్రీనివాసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,729 పాఠశాలలకు 39,569 హ్యాండ్ బుక్స్ సరఫరా చేశామన్నారు. శనివారం ఉదయం మండలాల నుంచి ఆయా పాఠశాలలకు చేర్చాల్సిన బాధ్యత ఎంఈఓలదేనన్నారు. అదే రోజు మధ్యాహ్నం జరిగే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఈ హ్యాండ్‌్ బుక్స్‌తో టీచర్లు హాజరుకావాల్సి ఉంటుందన్నారు.