పనులు ఇలా! పంటల సాగు ఎలా? | - | Sakshi
Sakshi News home page

పనులు ఇలా! పంటల సాగు ఎలా?

Jul 18 2025 5:12 AM | Updated on Jul 18 2025 5:12 AM

పనులు

పనులు ఇలా! పంటల సాగు ఎలా?

ఉరవకొండ: హెచ్చెల్సీకి నీరు విడుదలైనా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అవి జిల్లా సరిహద్దులోనే ఆగిపోయాయి. హెచ్చెల్సీలో చేపట్టిన మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయించకపోవడమే ఇందుకు కారణం. ఈ పనులు పూర్తి కావాలంటే మరో రెండు నెలలకు పైగా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ నెలాఖరుకు హెచ్చెల్సీకి నీటి విడుదల ఆపేస్తామంటూ టీబీ డ్యామ్‌ ఎస్‌ఈ నారాయణ నాయక్‌ రెండు రోజుల క్రితం స్పష్టం చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా హెచ్చెల్సీ ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారనుంది.

జిల్లా సరిహద్దులోనే నీరు

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీకి కేటాయించిన నీటి కోటాను ఈ నెల 10న డ్యామ్‌ అధికారులు వదిలారు. అయితే హెచ్చెల్సీలో చేపట్టిన మరమ్మతు పనులు ఎక్కడేగాని 50 శాతం కూడా పూర్తి కాకపోవడంతో నీటిని జిల్లా సరిహద్దులోని ఆపేశారు. ఉరవకొండ మండలం మోపిడి వద్ద హెచ్చెల్సీ ప్రధాన కాలువపై 189.25వ కిలోమీటరు లింక్‌ ఛానల్‌ వద్ద పీఏబీఆర్‌, ఎంపీఆర్‌ హెడ్‌రెగ్యూలేటర్ల పునఃనిర్మాణ పనులను రూ.8 కోట్లతో అనంతపురానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌ 13న చేపట్టింది. తుంగభద్ర జలాలు పీఏబీఆర్‌, ఎంపీఆర్‌కు చేరాలంటే ఈ లింక్‌ ఛానల్‌ చాలా కీలకం. జిల్లాకు తాగు, సాగునీటి అవసరాలకు మోపిడి లింక్‌ చానల్‌ ద్వారానే నీరు అందాల్సి ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పనులను సకాలంలో పూర్తి చేయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో పనులు ముందుకు సాగలేదు.

కమీషన్ల కోసం హడావిడిగా పనులు..

శిథిలావస్థకు చేరిన ఎంపీఆర్‌, పీఎబీఆర్‌ హెడ్‌ రెగ్యూలేటర్‌ మరమ్మతుకు కూటమి ప్రభుత్వం హడావిడిగా రూ.8 కోట్లు నిధులు విడుదల చేసింది. సాధారణంగా ఏటా జూన్‌, జూలైలో జిల్లా సరిహద్దుకు తుంగభద్ర జలాలు చేరుకుంటాయి. అయితే ఏప్రిల్‌లో టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించి, అదే నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే కమీషన్ల కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి ఒత్తిళ్లు మొదలవడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమైనట్లు సమాచారం. ఆ తర్వాత పనులను వేగవంతం చేయడంలోనూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో 60 శాతం పనులు అలాగే నిలిచిపోయాయి. గతంలో కురిసిన వర్షాలతో కాలువలో పెద్ద ఎత్తున నీరు చేరిందని, దీంతో పనులు ముందుకు సాగించడం కష్టమైందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే హెచ్చెల్సీకి నీటి విడుదల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకెళ్లడంతో నాణ్యత ప్రమాణాలు తిలోదకాలిచ్చి పనులు మమ అనిపించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

కోతలతో భారీ నష్టం

జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న హెచ్చెల్సీకి ఈ ఏడాది భారీగా కోత విధించారు. టీబీ డ్యాంలో నీటి నిల్వ ఆధారంగా కేటాయింపులు జరపగా హెచ్చెల్సీ వాటాను 18.396 టీఎంసీలకు కుదించారు. డ్యామ్‌ గేట్‌ మరమ్మతు కారణంగా 7.964 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వచ్చింది. జిల్లాలో తాగునీటి అవసరాలకు 10టీఎంసీలు అవసరం. నీటి ప్రవాహ నష్టాలు 2 టీఎంసీలు పోను జిల్లాకు అందే నీటిలో తాగునీటికి, సాగునీటికి ఏ మేర కేటాయిస్తారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో హెచ్చెల్సీలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో హెచ్చెల్సీ నీటి లభ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్‌ రెగ్యులేటర్ల నిర్మాణ పనులు పూర్తి కావాలంటే మరో రెండు నెలలకు పైగా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ లెక్కన ఈ పనులు నవంబర్‌ నాటికి పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నవంబర్‌ నెలాఖరుకు హెచ్చెల్సీకి నీటి విడుదల నిలుపుదల చేస్తామంటూ రెండు రోజుల క్రితం టీబీ డ్యాం అధికారులు ప్రకటించడంతో హెచ్చెల్సీపై జిల్లా రైతులు, ప్రజలు పెట్టుకున్న ఆశలు కాస్త గల్లంతు కానున్నాయి.

గేట్ల మరమ్మతు కారణంగా కోల్పోయిన కోటా

వేగవంతం అయ్యేలా చూస్తాం

పీఎబీఆర్‌, ఎంపీఆర్‌ హెడ్‌ రెగ్యూలటరీ నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూస్తున్నాం. ఎంపీఆర్‌ రెగ్యూలటరీ పనులు పూర్తి కావొచ్చాయి. పీఎబీఆర్‌ రెగ్యూలటరీ పనులు పెండింగ్‌ ఉన్నాయి. వీటిని కూడా పూర్తి చేసి జిల్లాకు నీరు అందేలా కృషి చేస్తాం.

– నజీర్‌, ఏఈ, హెచ్చెల్సీ

కొనసాగుతున్న హెచ్చెల్సీ, పీఎబీఆర్‌, ఎంపీఆర్‌ రెగ్యూలేటర్ల నిర్మాణ పనులు

పనులు పూర్తి కాకపోవడంతో జిల్లా సరిహద్దులోనే ఆగిన తుంగభద్ర జలాలు

పనులు పూర్తవడానికి మరో రెండు నెలలకు పైగా సమయం

నవంబర్‌ ఆఖరుకు నీటి విడుదల నిలుపుదల

పనులు ఇలా! పంటల సాగు ఎలా? 1
1/2

పనులు ఇలా! పంటల సాగు ఎలా?

పనులు ఇలా! పంటల సాగు ఎలా? 2
2/2

పనులు ఇలా! పంటల సాగు ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement