
పడిపోయిన సాగు విస్తీర్ణం
అనంతపురం అగ్రికల్చర్: వానల్లేక ఖరీఫ్ ఏరువాక ముందుకు కదలని దుస్థితి నెలకొంది. విత్తు సమయం దగ్గర పడుతున్నా సాగు విస్తీర్ణం పెరగడం లేదు. 50 వేల హెక్టార్ల వద్ద ఆగిపోయింది. వర్షాధారంగా ఖరీఫ్‌లో 3,39,716 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ... నైరుతి రుతుపవనాలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో వర్షాలు లేక సాగు చతికిలపడింది. ఇప్పటి వరకు కేవలం 15 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. అరకొర తేమ నడుమ అక్కడక్కడా విత్తనాలు విత్తుతున్నా... సాధారణ విస్తీర్ణం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. పంటల సాగుకు ఈనెల 15 వరకూ సమయమున్నా.. వాతావరణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుంటే నెలాఖరు లోపు 50 శాతం చేరుకోవడం గగనంగానే ఉంది. ఆగస్టు వస్తే వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటలు కాకుండా జొన్న, సజ్జ, కొర్ర, ఉలవ, పెసర, అలసంద లాంటి ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని చెబుతున్నారు.
గుంతకల్లులో 40 శాతం...
ఖరీఫ్‌లో సాధారణం కన్నా 30 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడంతో పంటల సాగుకు ఇబ్బందిగా మారింది. శెట్టూరు మినహా మిగతా 30 మండలాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో గుంతకల్లు మండలంలో అత్యధికంగా 40 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. 18 వేల హెక్టార్లకు గానూ 7 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. ఇక పుట్లూరు మండలంలో కేవలం ఒక శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. 4,199 హెక్టార్లకు గానూ 56 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. గుమ్మఘట్టలో రెండు శాతం, తాడిపత్రి, పుట్లూరు మండలాల్లో కేవలం 4 శాతం, విడపనకల్లులో 6, ఉరవకొండ, శింగనమల 8 శాతం, పామిడి, గుత్తి 9 శాతం... ఇలా 25 మండలాల్లో 5 నుంచి 20 శాతం లోపు విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. గుంతకల్లుతో పాటు బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, కంబదూరు, పెద్దవడుగూరు మండలాల్లో మాత్రమే 20 శాతం పైబడి విస్తీర్ణంలో పంటలు వేయడం విశేషం. ఇప్పటి వరకు 17 వేల హెక్టార్లలో వేరుశనగ, 14 వేల హెక్టార్లలో కంది, 7,300 హెక్టార్లలో పత్తి, 6 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 2,500 హెక్టార్లలో ఆముదం, 1,000 హెక్టార్లలో సజ్జ పంటలు సాగులోకి వచ్చాయి.
పడకేసిన ‘ఖరీఫ్’ ఏరువాక
50 వేల హెక్టార్ల వద్ద
ఆగిపోయిన పంటల సాగు
నెలాఖరు వరకు సమయం... అయినా, అంచనా చేరడం కష్టమే