
జనావాసాల నడుమ డంపింగ్ యార్డా?
అనంతపురం అర్బన్: ‘‘నగరంలోని చెత్తను తీసుకొచ్చి మా గ్రామాల వద్ద వేసి చెత్త దిబ్బలుగా మార్చాలని చూస్తున్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదు. తమ భవిష్యత్తుతో చెలగాటం వద్దు. కాదూ కూడదని ముందుకువెళితే అడ్డుకుని తీరుతాం’’ అంటూ నరసనాయనికుంట, నాగిరెడ్డిపల్లి, నారాయణపురం ప్రజలు, రైతులు పార్టీలకు అతీతంగా బుధవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఒక దశలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు మాట్లాడుతూ నగరంలోని డంపింగ్ యార్డ్‌ను అనంతపురం రూరల్ మండలం నరసనాయని కుంటకు అతి సమీపంలోని సర్వే నంబరు 263, నారాయణపురం సర్వే నంబరు 58లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమ య్యారన్నారు. ఎంపిక చేసిన స్థలం నరసనాయనికుంటకు 100 మీటర్లు, నాగిరెడ్డిపల్లికి వెయ్యి, నారాయణపురానికి 300 మీటర్ల దూరంలో ఉందన్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే నరసనాయనికుంట, నాగిరెడ్డిపల్లి, నారాయణపురం గ్రామాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తాము వ్యతిరేకించామన్నారు. ఈ మూడు గ్రామాల్లో 13 వేల మంది జనాభాతో పాటు కొడిమి గ్రామానికి చెందిన 5 వేల మంది ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. అయినప్పటికీ అక్కడే ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం రావడంతో మూడు గ్రామాల ప్రజలు ఐక్యంగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టామన్నారు. డంపింగ్ యార్డును జనావాసాలకు సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, అలాంటిది తమ గ్రామాల మధ్య ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. నగరంలోని చెత్తను తీసుకొచ్చి తమ గ్రామాల వద్ద వేసి ఊర్లను చెత్త దిబ్బలుగా మార్చాలని చూస్తారా అంటూ అధికారులపై మండిపడ్డారు. బుద్ది ఉన్న వారెవరైనా డంపింగ్ యార్డును గ్రామాల మధ్య జనావాసాల సమీపంలో ఏర్పాటు చేయాలని చూస్తారా అని ప్రశ్నించారు. తమ గ్రామాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తామందరం ఐక్యంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాదు.. కూడదు అక్కడే ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తే ఆ తరువాత పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్‌ను రైతులు కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు.డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో మూడు గ్రామాల పెద్దలు, రైతులు జగన్‌మోహన్‌రెడ్డి, ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, వెంకటరాముడు, నాగరాజు, రంగంపేట గోపాల్‌రెడ్డి, వెంకటేష్, రవి, పెద్దన్న, నాయక్, రమణ, కృష్ణారెడ్డి, రామసుబ్బారెడ్డి, కేశవ్, ఆదినారాయణ, నాగేష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, దామోదర్, సన్నప్పయ్య, రాయదుర్గం ఆంజనేయులు, రేనాటి దామోదర్, తదితరులు పాల్గొన్నారు.

జనావాసాల నడుమ డంపింగ్ యార్డా?