
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
● కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్:‘‘పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. పక్షం రోజులకు ఒకసారి పరిశ్రమలను కచ్చితంగా తనిఖీ చేయాలి’’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫ రెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రత చాలా ముఖ్యమన్నారు. జిల్లాలో నాలుగు అత్యంత ప్రమాదకర రసాయన పరిశ్రమలు, ఏడు సాధారణ ప్రమాదకర రసాయనాలు కలిగిన పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమలను ఫ్యాక్టరీస్, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అగ్ని మాపక శాఖల అధికారులు తనిఖీ చేసి 15 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు అవగాహన కల్పించాలని, ఇదే క్రమంలో సంబంధిత శాఖలకు సమాచారం అందేలా అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ మునిప్రసాద్, ప్రజారోగ్య శాఖ ఈఈ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్–తిరుపతి
మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: తిరుమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు (07009, 07010) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం (5 సర్వీసులు మాత్రమే) రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు. కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట స్టేషన్ల మీదుగా వెళ్తాయన్నారు.
నాంధేడ్–ధర్మవరం మధ్య..
నాంథేడ్–ధర్మవరం మధ్య ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, ఆదివారం రైళ్లు నడుపుతున్నట్లు శ్రీధర్ తెలిపారు. నాంధేడ్ జంక్షన్ (07189)లో ఆగస్టు 1 (శుక్రవారం) రైలు బయలుదేరుతుందన్నారు. అలాగే, ఆగస్టు 3 (శనివారం) తిరుపతి జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. మద్ఖడ్, ధర్మా బాద్, బాసర, నిజామబాద్, కామారెడ్డి, మేడ్చల్, చర్లోపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పగడిరాళ్ల, నీమ్లరిపూరి, రంపిచర్ల, వినుకొండ, మార్కపూర్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, జమ్మలమడుగు, యర్రగుంట్ల, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు,కదిరి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.