
ఆధార్ అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసు
అనంతపురం అర్బన్: ‘‘ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియల్లో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు తప్పవు’’ అని డీఆర్‌ఓ ఎ.మలోల అన్నారు. డీఆర్‌ఓ గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాటాడుతూ మీ–సేవ, నెట్ సెంటర్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల వారికి సంబంధించి ఆధార్ నవీకరణ జరగాల్సి ఉందన్నారు. ఆధార్ నమోదులో జిల్లా 2వ స్థానంలో ఉందని, సెప్టెంబరు నెలాఖరుకు 100 శాతం పూర్తిచేసి తొలిస్థానంలోకి తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో 72 గ్రామ సచివాలయాలు, 16 ఈ సేవ కేంద్రాలు, 9 పోస్టాఫీసులు, 6 బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులు, 21 బ్యాంకుల్లో ఆధార్ నమోదు చేస్తారన్నారు. వైద్య కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయం ద్వారా ఆధార్ నమోదు బయోమెట్రిక్ అప్డేట్ చేపడుతున్నామని తెలిపారు. 0–5 ఏళ్ల పిల్లలు జిల్లాలో 2,25,335 మంది ఉండగా, ఈ ఏడాది జూన్ 30 నాటికి 1,75,213 మందికి ఆధార్ కార్డులు జారీ చేశామని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంగా ఉంటుందని, పొరపాట్లకు తావివ్వకుండా నమోదు ప్రక్రియ పక్కాగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆధార్ పర్యవేక్షణ అధికారి నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
నీటి వనరుల ఆక్రమణ, అక్రమ కట్టడాలపై తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓ ఎ.మలోల ఆదేశించారు. వాచ్‌డాగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీలు, పంచాయతీల పరిధిలోని నీటివనరుల్లో ఆక్రమణల కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఇలాంటి వాటిని నిరోధించడంలో అలసత్వ ధోరణి పనికిరాదన్నారు. నీటి వనరుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, ఆర్‌డీఓ కేశవరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.