
కర్నూలులో హాస్పిటల్‌పై పామిడి వాసుల దాడి
కర్నూలు(హాస్పిటల్): జ్వరం కారణంగా చికిత్సకు వచ్చి యువతి మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు గురువారం కర్నూలులోని శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిపై దాడి చేసి గాజు కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. వంద మందికి పైగా నిర్వహించిన ఈ దాడితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... అనంతపురం జిల్లా పామిడికి చెందిన అనిత(21)కు కర్నూలులోని కల్లూరు ఎస్టేట్ పోలీస్ కాలనీకి చెందిన ప్లాట్ల రమణ కుమారుడు నాగేంద్రతో ఏడాది క్రితం వివాహమైంది. తండ్రితో కలిసి నాగేంద్ర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనితకు ఈ నెల 15న జ్వరం రావడంతో సమీపంలో ఉన్న శ్రీచక్ర హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి క్యాజువాలిటీలో ఆమెకు అవసరమైన చికిత్సను అందించి సాయంత్రం ఇంటికి పంపించారు. మరుసటి రోజు బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. కాగా, గురువారం ఉదయం పామిడి నుంచి వచ్చిన అనిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో శ్రీచక్ర హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అనితకు సకాలంలో వైద్యం అందించలేదని, మెరుగైన వైద్యం అందించి ఉంటే బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన క్రమంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక దశలో ఆస్పత్రిపై రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. బయట ఉన్న మెడికల్‌షాపు అద్దాన్ని, గాజు తలుపును ధ్వంసం చేశారు. ఆస్పత్రిలోకి చొరబడి కనిపించిన ప్రతి వస్తువునూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్యాజువాలిటీ, ఆరోగ్యశ్రీ కియోస్క్, కిటికీలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు రామయ్య యాదవ్, నాగరాజురావు, శేషయ్య, విక్రమసింహ, తబ్రేజ్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనిత మృతితో సంబంధం లేదు
అనిత మృతికి ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని శ్రీచక్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిత అనే యువతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వచ్చిందన్నారు. క్యాజువాలిటీలోనే సాయంత్రం వరకు ఆమెకు అవసరమైన మందులు ఇచ్చి, ఫ్లూయిడ్స్ పెట్టామన్నారు. ఆమె కోలుకోవడంతో ఇంటికి వెళ్తానంటే పంపించామన్నారు. మరుసటి రోజు రాత్రి అత్యవసర పరిస్థితిలో కుటుంబసభ్యులు ఆమెను క్యాజువాలిటీకి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెంది ఉందన్నారు. ఆమె మృతికి, ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని, అయినా ఆస్పత్రిపై దాడి చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్‌రెడ్డి, డాక్టర్ బాలమద్దయ్య, ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
యువతి మృతితో కుటుంబ సభ్యుల ఆందోళన
ఆస్పత్రి అద్దాల ధ్వంసం

కర్నూలులో హాస్పిటల్‌పై పామిడి వాసుల దాడి