ఉరవకొండ: పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపులను రాష్ట్ర విజిలెన్స్ అధికారుల బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. స్థానిక సంకల్ప్, అయ్యన్ హనుమాన్ ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ ఏడీఏ సాయిరెడ్డి, ఎస్‌ఐ నరేంద్రభూపతి, టెక్నికల్ ఏఓ రాకేష్ నాయక్ బృందం సోదాలు చేపట్టింది. ఎరువులు, ఇతర క్రిమి సంహారక మందులు, వాటికి సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సంకల్ప్ షాపులో రూ.77,500 విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు. కాలం చెల్లిన, నకిలీ మందులను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తే అలాంటి షాపులను సీజ్ చేస్తామని షాపు నిర్వాహకులకు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ రామకృష్ణుడు, ఏఈఓ భరత్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి– చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–చర్లపల్లి మధ్య ఆగస్టు 3 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి జంక్షన్ నుంచి (07481) ఆగస్టు 3వ తేదీ రైలు బయలుదేరుతుందన్నారు. తిరిగి చర్ల్లపల్లి జంక్షన్ నుంచి (07482) 4వ తేదీ సోమవారం ప్రారంభమవు తుందన్నారు. రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిప్రతి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, కాచిగూడ మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. స్పెషల్ రైళ్లలో 3టైర్ ఏసీ మాత్రమే ఉంటుందన్నారు.
తపాలా సేవలకు అంతరాయం
అనంతపురం సిటీ: తపాలా సేవలకు ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆ శాఖ అనంతపురం డివిజన్ సూపరింటెండెంట్ కె.ఆదినారాయణ గురువారం తెలిపారు. ఈ నెల 22న కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 మార్చనున్నట్లు వివరించారు. ఈ కారణంగా ఆయా తేదీల్లో సేవలకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తపాలా శాఖలోనూ అనేక రకాల సేవలను విస్తృతపరచి సత్వర, జవాబు దారీగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పెంచండి
అనంతపురం ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్ అడ్మిషన్లు పెంచాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక సైన్స్ సెంటర్‌లో జిల్లా వ్యాప్తంగా ఎంఈఓ–1,2లు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందనాయక్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గత ఏడాది కంటే ఈసారి మరిన్ని అడ్మిషన్లు పెంచేలా చూడాలన్నారు. చదువు మధ్యలో మానేసిన, రెగ్యులర్ స్కూళ్లు, కళాశాలలకు వెళ్లేందుకు వీలుకాని వారు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఇదొక మంచి అవకాశం అన్నారు. ఎంఈఓలు, కో– ఆర్డినేటర్లు ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అడ్మిషన్లకు సంబంధించిన వాల్ పోస్టర్లు, బుక్ లెట్లు, కరపత్రాలను అందజేశారు.
ఇసుక ట్రాక్టర్ల సీజ్
పెద్దపప్పూరు: మండలంలోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గురువారం పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామానికి చెందిన నగేష్ యాదవ్, ప్రేమనాథ్ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లుగా అందిన సమాచారంతో తనిఖీలు చేపట్టి వాహనాలను సీజ్ చేసి, ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఉరవకొండలో రాష్ట్ర విజిలెన్స్ అధికారుల సోదాలు