
వ్యక్తి అదృశ్యం
అనంతపురం: తాడిపత్రి మండలం చిన్నపొడమల గ్రామానికి చెందిన నారాయణస్వామి కుమారుడు కమ్మగార్ల రామకృష్ణ (39) కనిపించడం లేదు. సదరం సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం బుధవారం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి వచ్చిన ఆయన.. ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. కాగా, రామకృష్ణకు మాటలు రావు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు అనంతపురం రెండో పట్టణ సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96806 కు సమాచారం అందించాలని కోరారు.
వివాహిత ఆత్మహత్య
గుమ్మఘట్ట: మండలంలోని సిరిగెదొడ్డి గ్రామానికి చెందిన వివాహిత పార్వతి (29) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన కిందింటి గోవిందుతో పార్వతికి పదేళ్ల క్రితం వివాహమైంది. తొమ్మిది నెలల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై ఇంటికి చేరుకుని ఆమెను రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మతిస్థిమితం సరిగా లేక ఇబ్బంది పడుతున్న ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
‘ఎంటుఎం’ యూట్యూబర్‌పై కేసు నమోదు
కదిరి అర్బన్: పాత్రికేయ వృత్తిని కించపరిచేలా వ్యవహరించారనే ఫిర్యాదుతో ఎంటుఎం యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు సుధాకర్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కదిరి సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను గురువారం రాత్రి ఆయన వెల్లడించారు. విలేకరులకు ఇంటి పట్టాలపై మంజూరు విషయంగా కొన్ని రోజుల క్రితం కదిరిలో ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ అంశంపై ‘రాయలసీమలో ఒక ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం... మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడానికేనా?’ అంటూ ఓ కథనాన్ని హైదరాబాద్‌కు చెందిన ఎంటుఎం యూట్యూబ్ చానల్ నిర్వాహకడు సుధాకర్ పోస్టు చేశాడు. ఈ కథనం ప్రతికా విలేకరుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, ఇందుకు బాధ్యులైన సుధాకర్‌తో పాటు అదే చానల్ అనంతపురం ప్రతినిధి వినోద్‌కుమార్, కదిరి వేమా న్యూస్ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు వేమ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కదిరికి చెందిన ఓ న్యూస్ చానల్ రిపోర్టర్ సోమశేఖరనాయుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

వ్యక్తి అదృశ్యం