
ఎర్ర మట్టిని మింగేస్తున్నారు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎర్రమట్టిని అధికార పార్టీ నేతలు తోడేళ్లుగా మారి మింగేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని కంబదూరు మండలంలో మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ప్రభుత్వానికి రుసుము చెల్లించకుండానే రోజుకు రూ. లక్షలు మట్టిని కొల్లగొడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనుల శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఎస్‌ఆర్‌సీ ఇష్టారాజ్యం..
కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లి సర్వే నంబర్ 9లో ప్రభుత్వ భూమి సుమారు 96 ఎకరాలకు పైగా ఉంది. దశాబ్దాల నుంచి పశువుల మేతకు అవసరమైన పచ్చిక బయలుగా ఉపయోగపడుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో ఆ మేరకే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ భూమిలో అధికార పార్టీ నేతలు ఎర్రమట్టి తవ్వకాలకు తెర లేపారు. ప్రస్తుతం మండల కేంద్రం కంబదూరు నుంచి రామగిరి మండలం పేరూరు వరకు డబుల్ లేన్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు పనులను ఎస్‌ఆర్‌సీ సంస్థ చేపడుతోంది. ఈ క్రమంలోనే దాదాపు 7 కిలోమీటర్ల మేర ఎర్రమట్టిని ఇప్పటికే రోడ్డుకిరువైపులా వేసేశారు. అయితే పొలాల నుంచి ఎర్రమట్టిని తరలించాలంటే సదరు రైతుల అనుమతితో పాటు ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నాం.. మనల్ని అడిగేదెవరని అనుకున్నారో ఏమో అలాంటివేమీ లేకుండా పచ్చిక బయలులోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.
పట్టని అధికారులు..
కంబదూరు నుంచి పేరూరు వరకు డబుల్ లేన్ రోడ్డు పనులు 14 కిలోమీటర్ల మేర రూ.32 కోట్లతో జరుగుతున్నాయి. ఆ రోడ్డుకిరువైపులా మట్టి వేసేందుకు ఎస్‌ఆర్‌సీ వారు రోజూ 10 నుంచి 20 టిప్పర్ల మట్టిని తరలించినట్లు సమాచారం. ఇలా రోజుకు మట్టి తవ్వకాలతో లక్షలాది రూపాయలు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనుల శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై కంబదూరు తహసీల్దార్ బాలకిషన్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో ‘సాక్షి’ పలుమార్లు ప్రయత్నించినా స్పందించలేదు.
ఎస్‌ఆర్‌సీ సంస్థ అడ్డగోలు తవ్వకాలు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

ఎర్ర మట్టిని మింగేస్తున్నారు

ఎర్ర మట్టిని మింగేస్తున్నారు