పరిటాలకు పరాభవం | - | Sakshi
Sakshi News home page

పరిటాలకు పరాభవం

Jul 17 2025 3:32 AM | Updated on Jul 17 2025 3:32 AM

పరిటాలకు పరాభవం

పరిటాలకు పరాభవం

రామగిరి ఎంపీపీ ఎన్నికలో

పారని పాచిక

ఎన్ని కుతంత్రాలు చేసినా దక్కని పీఠం

కేవలం ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరు

రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నిరసిస్తూ

వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీల గైర్హాజరు

ఎంపీపీ ఎన్నిక నిరవధిక వాయిదా వేస్తున్నట్లు అధికారుల ప్రకటన

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అధికార పార్టీ కిడ్నాప్‌లు...దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రామగిరి ఎంపీపీ ఎన్నిక బుధవారం మరోసారి నిరవధికంగా వాయిదా పడింది. అధికారం చేతుల్లో ఉంది... ఏమైనా చేయవచ్చుననుకున్న ‘పరిటాల’ కుటుంబానికి సొంత మండలంపైనే పట్టుచిక్కక తీవ్ర పరాభవం ఎదురైంది.

ఇద్దరు మాత్రమే హాజరు

రామగిరి ఎంపీపీ ఎన్నిక కోసం అధికారులు బుధవారం ఏర్పాట్లు చేశారు. రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అయితే 10 మంది ఎంపీటీసీలకు గాను నసనకోట ఎంపీటీసీ శ్రీనివాసులు, పేరూరు–1 ఎంపీటీసీ కర్రెన్న మాత్రమే ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. వారిద్దరూ పురుషులు కావడం...ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు అయిన నేపథ్యంలో ఎన్నికల అధికారి సంజీవయ్య రామగిరి ఎంపీపీ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఎప్పుడు ఎన్నికల తేదీని ప్రకటిస్తే మళ్లీ అప్పుడు రామగిరి ఎంపీపీ ఎన్నికను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

తొమ్మిదిమంది వైఎస్సార్‌ సీపీ వారే...

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిటాల సొంత మండలం రామగిరిలో వైఎస్సార్‌ సీపీ విజయ ఢంకా మోగించింది. మండలంలో తొమ్మిది పంచాయతీలుండగా ఏడు పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులే ఘన విజయం సాధించారు. ఇక మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... 9 స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులే విజేతలుగా నిలిచి తొలిసారి రామగిరిలో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కావడంతో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మీనుగ నాగమ్మను పీఠంపై కూర్చోబెట్టారు.

మూడోసారి విఫలం

2024 డిసెంబర్‌ 30వ తేదీన రామగిరి ఎంపీపీ మీనుగ నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎలాగైనా సొంతమండలం రామగిరిలో పట్టునిలుపుకోవాలని పరిటాల కుటుంబం భావించింది. కేవలం ఒకే ఒక్క పురుష ఎంపీటీసీతో అప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపీపీ స్థానం కై వసం చేసుకోవాలని ప్లాన్‌ వేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు మార్చి 27న రామగిరి ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. టీడీపీ తరఫున నసనకోట ఎంపీటీసీ శ్రీనివాసులు మాత్రమే ఉండగా... పేరూరు–1 ఎంపీటీసీ కర్రెన్నతో పాటు మాధాపురం ఎంపీటీసీ సంపత్‌కుమార్‌ను బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారు. అయినా అప్పుడు ఎన్నిక వాయిదా పడగా, మే 19న మరోమారు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కావడంతో రెండోసారి ఏకంగా పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతమ్మను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. దీంతో రెండుసార్లు ఎంపీపీ స్థానాన్ని కై వసం చేసుకోవాలని దెబ్బతిన్న పరిటాల కుటుంబం తాజాగా బుధవారం జరిగిన ఎన్నికలోనైనా పీఠం దక్కించుకోవాలని భావించింది. అయితే వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలెవరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో వారి పథకం పారలేదు.

ప్రజాతీర్పును గౌరవించి..

వైఎస్సార్‌ సీపీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు ప్రజాతీర్పును గౌరవించారు. వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచిన వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డారు. ప్రలోభపెట్టినా.. భయపెట్టినా వెనక్కు తగ్గలేదు. అధికారం అండతో అప్రజాస్వామికంగా ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు రెడ్‌బుక్‌ రాజ్యాంగం అనుసరిస్తున్న అధికార పార్టీ చర్యలను నిరసిస్తూ ఎంపీపీ ఎన్నికను బహిష్కరించినట్లు ప్రకటించారు.

సొంత మండలం రామగిరిపై పట్టు నిలుపుకోవాలని భావించిన ఎమ్మెల్యే పరిటాల సునీతకు పరాభవం ఎదురైంది. మెజార్టీ లేకపోయినా అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని ఆమె వేసిన పాచిక పారలేదు. అధికారంలో ఉన్నా...అన్ని వ్యవస్థలనూ వాడుకున్నా రామగిరి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకోలేక భంగపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement