
మెగా.. మొక్కుబడిగా..
● గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తి చూపని తల్లిదండ్రులు
● ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసేందుకే ప్రాధాన్యత
అనంతపురం ఎడ్యుకేషన్: మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లకు జిల్లాలో స్పందన కరువైంది. వారం రోజులుగా కలెక్టర్ మొదలు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంల మెడపై కత్తిపెట్టి ఒత్తిళ్లు చేశారు. ఇంతచేసినా తల్లిదండ్రుల నుంచి స్పందన తూతూమంత్రంగానే వచ్చింది. గురుపౌర్ణమి కావడం, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది రైతులు, కూలీ చేసుకునే వారు ఉండడంతో పనులు మానుకుని వచ్చేందుకు తల్లిదండ్రులకు ఆసక్తి చూపలేదు. చాలా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ ఫొటోలు తీయించి మమ అనిపించారు.
ఫొటోల అప్‌లోడ్‌పైనే ఆసక్తి
కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫొటోల కోసం తల్లిదండ్రులను బలవంతంగా పిలిపించి వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల అభివృద్ధి, పురోగతిపై చర్చ కంటే కూడా కార్యక్రమం నిర్వహించామా...ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేశామా.. పని అయిపోయిందా అనే విధంగా జరిగాయి. ప్రభుత్వ ప్రచారం కోసం తప్ప విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదంటూ తల్లిదండ్రులు నిట్టూర్చారు. ‘నాడు–నేడు’ పనులు నిలిచి ఎక్కడికక్కడ ఆగిపోయిన తరగతి గదుల గురించి కనీసం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ‘మెగా పీటీఎం’ నిర్వహణకు ప్రభుత్వం చాలీచాలని నిధులు కేటాయించడంతో అవి సరిపోక తమ జేబు నుంచి పెట్టుకోవాల్సి వచ్చిందని పలువురు హెచ్‌ఎంలు వాపోయారు.
2,395 స్కూళ్లల్లో మెగా పీటీఎంలు
జిల్లా వ్యాప్తంగా 2,395 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పండుగ వాతావరణంలో మెగా పీటీఎం వేడుకలు జరిగాయని డీఈఓ ప్రసాద్‌బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ తెలిపారు. తొలుత తరగతుల వారీగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారన్నారు. ప్రజా ప్రతినిధులు ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మెగా పీటీఎంలకు హాజరయ్యారన్నారు. మెగా పీటీఎంల నిర్వహణలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
అత్యుత్సాహం.. అయోమయం
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన పీటీఎంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనుచరుల అత్యుత్సాహంతో అయోమయం నెలకొంది. ఎంపీ వెంట తాడిపత్రికి చెందిన టీడీపీ నాయకుడు రామాంజినేయులు, బుల్లెట్ లింగమయ్య వచ్చారు. రామాంజి సభావేదికపై ఆశీనులు కాగానే లింగమయ్య రాజకీయ ప్రసంగం చేస్తూ ‘జై వాల్మీకి’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. పాఠశాలలో కుల రాజకీయాలు ఏంటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
● పిల్లలకు యూనిఫాం క్లాత్ ఇవ్వకుండా హెచ్‌ఎం, ఉపాధ్యాయులు దాచి పెద్ద సైజులో పరదా కుట్టించడం విమర్శలకు తావిచ్చింది. కూడేరులోని హైస్కూల్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ పిల్లలకు యూనిఫాం క్లాత్ ఇవ్వకుండా పరదా తయారు చేశారా అంటూ పలువురు తల్లిదండ్రులు చర్చించుకోవడం కనిపించింది.
సత్ప్రవర్తనతో మెలగాలి
ఉరవకొండ: విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలిగి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పిలుపు నిచ్చారు. గురువారం ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మెగా పీటీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యావ్యవస్థను గాడిన పెట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారన్నారు. కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు.

మెగా.. మొక్కుబడిగా..