
టీడీపీ కార్యకర్తల బాహాబాహీ
బ్రహ్మసముద్రం: ఉపాధి కూలీల పొట్టకొడుతూ యంత్రాలతో పని పూర్తి చేయించి బిల్లులు చేసుకునేందుకు ఓ టీడీపీ నేత అండగా నిలవగా.. అదే పార్టీకి చెందిన సీనియర్లు వ్యతిరేకించారు. దీంతో రెండు వర్గాల కార్యకర్తల ధర్నాలతో ఎంపీడీఓ కార్యాలయం దద్ధరిలిల్లింది. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వర్గానికి చెందిన మండల టీడీపీ కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు అండతో ఆయన అనుచరులు ఇటీవల ఉపాధి పనులను జేసీబీతో పూర్తి చేయించారు. ఈ అంశంపై అధికారులకు అదే పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు.
అక్రమాలు కప్పిపుచ్చే ప్రయత్నం
ఉపాధి పనులపై విచారణ చేసేందుకు డ్వామా పీడీ సలీంబాషా శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న విషయం తెలుసుకున్న శ్రీరాములు తన వర్గం వారితో కలసి అక్కడకు చేరుకుని అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పార్టీ సీనియర్ నేతలు, పలువురు కార్యకర్తలు సైతం కార్యాలయానికి చేరుకున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని సీనియర్లు డిమాండ్ చేశారు. ఆ సమయంలో వారిని శ్రీరాములు వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో సీనియర్ల వర్గం కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధం కావడంతో శ్రీరాములు వర్గీయులు ప్రతిఘటించారు. ఒకానొక దశలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణకు సిద్ధమయ్యారు.
పీడీకి సహకరించని క్షేత్ర సిబ్బంది
యంత్రాలతో పూర్తి చేసిన పనులను డ్వామా పీడీ సలీంబాషా పరిశీలించి, కొలతలు సిద్ధమయ్యారు. ఆ సయయంలో రికార్డులు, టేప్ తీసుకురావాలని ఉపాధి ఈసీ జయప్రకాష్ బీఎఫ్‌టీ వన్నూరుస్వామి సూచించినా వారు పట్టించుకోలేదు. విచారణను పెడదోవ పట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. దీంతో పీడీ అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి అధికారుల సమక్షంలో మరోసారి వాగ్వాదానికి దిగారు. ఈ ఏడాదిలో ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన ప్రతి పనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు.
ఎంపీడీఓ కార్యాలయం వద్ద
రెండు వర్గాల తోపులాట