
కి‘లేడీ’ల హస్తలాఘవం
● జ్యువెలరీ దుకాణంలో రూ. 50 వేల నెక్లెస్ చోరీ
అనంతపురం: కి‘లేడీ’లు హస్తలాఘవం ప్రదర్శించారు. రూ. 50 వేల విలువైన నెక్లెస్ చోరీ చేసి ఉడాయించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. అనంతపురం నగరంలోని కమలానగర్‌లో ఉన్న అన్నపూర్ణ జ్యువెలర్స్ దుకాణానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముగ్గురు మహిళలు వచ్చారు. కొద్దిసేపు నగలను పరిశీలిస్తున్నట్లు నటించారు. జ్యువెలరీ సిబ్బందిని ఏమార్చి ఒక గ్రాము గోల్డ్‌తో తయారైన రూ.50 వేల విలువ చేసే నెక్లెస్ బాక్స్‌ను తమ వెంట తెచ్చిన బ్యాగులో వేసుకుని బయటకు వెళ్లిపోయారు. దుకాణదారులు గుర్తించేలోపు కిలేడీలు అక్కడి నుంచి ఉడాయించారు. ఇదంతా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు దుకాణ యజమానులు తెలిపారు.