
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
ఉరవకొండ: ఎదిగిన కొడుకులకు ఉద్యోగాలు రాకపోవడంతో కొంత కాలంగా తీవ్ర మనోవేదనకు గురైన ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడి శుక్రవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య రాజమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఉరవకొండ పట్టణంలోని మల్లేశ్వర టాకీసు వద్ద నివాసముంటున్న హజరతయ్య (53), రాజమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. అనంతపురం బైపాస్ వద్ద సిమెంట్ బ్రిక్స్, రింగులు విక్రయిస్తూ హజరతయ్య జీవనం సాగించేవాడు. వ్యాపారం చేస్తున్న పెద్దకుమారుడితో పాటు కుమార్తెకు హజరతయ్య వివాహం చేశాడు. అయితే ఇద్దరు కుమారులకు ఉద్యోగాలు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన హజరతయ్య అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో తాను వ్యాపారం చేసే షాపులోనే ఫ్యానుకు ఉరేసుకొని మృతి చెందాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కష్టపడి చదివితేనే
ఉజ్వల భవిష్యత్తు
అనంతపురం రూరల్: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి అన్నారు. శనివారం నగరంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల విద్యార్థులు గౌరవంగా మెలగాలన్నారు. విద్యార్థి దశ నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. బాలికలు ఆత్మస్థైర్యంతో మందుకెళ్లాలన్నారు. వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థినులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఏబీసీడబ్ల్యూఓ సుభాషిణి, వార్డెన్లు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి
గుత్తి రూరల్: మండలంలోని కరిడికొండ గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని బస్సు డ్రైవర్ మహమ్మద్ మునీర్ (48) మృతి చెందాడు. పోలీసుల వివరాలమేరకు.. హైదరాబాదులోని శివరాంపల్లి ఆదర్శనగర్‌కు చెందిన మునీర్... ట్రాన్స్ ఇండియా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు శనివారం వేకువజామున కరిడికొండ శివారులోకి రాగానే టైరు పంక్చర్ అయింది. డ్రైవర్ మునీర్ బస్సును రోడ్డు పక్కన ఆపి మరో డ్రైవర్‌తో కలిసి టైరు మారుస్తుండగా అనంతపురం వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి కొట్టి వెళ్లిపోయింది. మునీర్ తీవ్రంగా గాయపడగా మరో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. మునీర్‌ను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడ. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదేనా ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ?
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పిన ప్రజాప్రతినిధులు...అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కనీస సమస్యలు పరిష్కంచలేదు. ఇదేనా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే? అని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు మండిపడ్డారు. శనివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండర్ లీవులు, రిటైర్డ్ అయిన వారికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ప్రకారం 2003 డీఎస్సీ వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, సహాధ్యక్షురాలు సరళ తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య