
కంప్యూటర్ పరిజ్ఞానంతోనే ఉద్యోగావకాశాలు
గుత్తి: ప్రపంచమంతా కంప్యూటర్ చుట్టే తిరుగుతోందని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ బోర్డు మెంబర్ విజయ్ ప్రతాప్ సింగ్ అన్నారు. గుత్తిలోని కర్నూలు రోడ్డులో ఉన్న జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వెబ్ టెక్ కంపెనీ కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌ను విజయ్‌ప్రతాప్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమన్నారు. కంప్యూటర్ జ్ఞానం ఉంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. రోజూ కనీసం గంట పాటైనా కంప్యూటర్ నేర్చుకోవాలన్నారు. కంప్యూటర్ జ్ఞానం ఉంటే కచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరువకావచ్చన్నారు. సాధారణ విద్యతో పాటు కంప్యూటర్ విద్యను కూడా నేర్చుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, వెబ్ టెక్ కంపెనీ ప్రతినిధి నిరంజనీస్, సీనియర్ డీఎంఈ ప్రమోద్, హెచ్‌ఎం సుంకన్న కంప్యూటర్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వెబ్ టెక్ సిబ్బంది పాల్గొన్నారు.
చెక్ డ్యామ్ ప్రారంభం
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి వద్ద చెక్ డ్యామ్‌ను రైల్వే బోర్డు మెంబర్ విజయ్ ప్రతాప్ సింగ్ ప్రారంభించారు. అనంతరం డీజిల్ షెడ్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏడీఎంఈ అశోక్ గౌడ్, ఎస్‌ఎస్‌ఈ మనోజ్ , గోవిందరాజులు, రాజేంద్రప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైల్వే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
గుంతకల్లు: రైల్వే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రైల్వే బోర్డు అడిషన్ మెంబర్ విజయ్‌ప్రతాప్‌సింగ్ తెలిపారు. శనివారం ఆయన గుంతకల్లులో పర్యటించారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. విజయ్‌పత్రాప్‌సింగ్ గుంతకల్లు డీఆర్‌ఎంగా ఉన్న సమయంలో రైల్వేస్టేషన్, రైల్వే ఆస్పత్రి, రైల్వే క్రీడామైదనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసిన విషయాన్ని స్థానిక ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన డీజల్ షెడ్‌లోని నూతన బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఆవరణలో మొక్కలు నాటారు. రన్నింగ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేలో కీలకమైన రన్నింగ్ విభాగం సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.
దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ బోర్డు మెంబర్ విజయ్ ప్రతాప్ సింగ్