
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
బొమ్మనహాళ్: మండలంలోని కొలగానహాళ్లికి చెందిన అనంతరాజుపై హత్యాయత్నం ఘటనలో మైలాపురానికి చెందిన చింతకుంట విజయ్‌కుమార్‌రెడ్డిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొలగానహాళ్లికి చెందిన అనంతరాజు కొంతకాలంగా మైలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై వివాదం తలెత్తి ఈనెల 7న అనంతరాజుపై చింతకుంట విజయ్‌కుమార్‌రెడ్డి దాడి చేసి గాయపరిచాడన్నారు. అనంతరాజు, ఆయన బంధువులు మైలాపురం చేరుకొని విజయ్‌కుమార్‌రెడ్డి ఇళ్లల్లోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు వరి గడ్డికి నిప్పు పెట్టి ఆస్తి నష్టం చేశారని పేర్కొన్నారు. ఆస్తి నష్టం చేసిన 21 మందిని అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపించామన్నారు. అనంతరాజుపై దాడికి పాల్పడిన విజయ్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని వెల్లడించారు. శనివారం మైలాపురం గ్రామంలో విజయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. సమావేశంలో ఏఎస్‌ఐ హనుమంతరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
యాడికి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చందన – దైవాలమడుగు గ్రామాల మధ్య శనివారం చోటు చేసుకుంది. సీఐ ఈరన్న వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లికి చెందిన చెందిన విజయభాస్కర్‌రెడ్డి (40)కి భార్య అమరావతి, కుమారుడు చంద్రమౌళిరెడ్డి, కుమార్తె సుప్రజ ఉన్నారు. విజయభాస్కర్‌రెడ్డి 20 ఏళ్లుగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ప్యాపిలి సమీపంలో ఉన్న అరుణాచలం లారీ ట్రాన్స్‌పోర్టులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 20 రోజులుగా డ్యూటీ చేసిన ఆయన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో డ్యూటీ దిగి తన ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరాడు. అయితే డోన్ రాయల చెరువు రోడ్డు మార్గంలో చందన గ్రామ సమీపంలో ఉన్న మూలుపుల దగ్గర వాహనం అదుపు తప్పి వ్యవసాయ తోటలో పడి విజయభాస్కర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా శనివారం ఉదయం సమాచారం అందుకున్న సీఐ ఈరన్న సిబ్బందితో వెళ్లి మృతుడి సెల్‌ఫోన్ ద్వారా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్