
నెట్టికంటుడి సేవలో కేంద్ర సహాయ మంత్రి
తకల్లు రూరల్: కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి కుటుంబ సభ్యుల పేరున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు.
నేడు ఏఎన్‌ఎం రీ కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సచివాలయ ఏఎన్‌ఎంలకు ఆదివారం రీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. సీనియారిటీ ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రేపు కలెక్టరేట్‌లో
‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’ జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఈనెల 14న సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు.రెవెన్యూభవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని కోరారు. అర్జీల స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
ఆంధ్రా సరిహద్దుకు
తుంగభద్ర జలాలు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాలు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించాయి. శనివారం రాత్రి 10 గంటలకు ఆంధ్రా సరిహద్దు 105–272 కిలోమీటర్ రెగ్యులేటర్ వద్దకు నీళ్లు చేరుకున్నాయి. ఈ నెల 10న హెచ్చెల్సీకి నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే, హెచ్చెల్సీలో మరమ్మతు, లైనింగ్, బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దులోని రెగ్యులేటర్ గేట్లను కిందకు దింపడంతో తుంగభద్ర జలాలు సరిహద్దులోనే నిలిచిపోయాయి. లీకేజీ కారణంగా 50 క్యూసెక్కుల వరకు వస్తుండడంతో పనులకు ఇబ్బంది లేకుండా అధికారులు హెచ్చెల్సీ ఒకటో డిస్టిబ్యూటరీ వద్ద మట్టితో అడ్డుకట్ట వేశారు. ఈ నెల 20లోపు మరమ్మతు పనులు పూర్తి చేసి తర్వాత నీటిని తీసుకోనున్నట్లు సమాచారం.

నెట్టికంటుడి సేవలో కేంద్ర సహాయ మంత్రి