
అధికారుల వేధింపులు తాళలేక..
గుంతకల్లు/టౌన్: అధికారుల వేధింపులు తాళలేక విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుని బంధువులు, తోటి ఉద్యోగులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని బ్యాంక్ కాలనీలో నివాసముంటున్న అన్సూర్ గతంలో గుత్తి ట్రాన్స్‌కో పరిధిలోని ఆర్‌టీఎస్‌ఎస్ (220కె.వి)లో కాంట్రాక్ట్ హెల్పర్‌గా పనిచేసేవాడు. పరస్పర బదిలీల్లో భాగంగా తకల్లులోని ఆలూరు రోడ్డులో ఉన్న 132కేవీ సబ్‌స్టేషన్‌కు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న రమేష్‌ను గుత్తికి బదిలీ చేశారు. అయితే ఈ బదిలీల్లో తనకు అన్యాయం జరిగిందని ఓ సహోద్యోగి ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు అన్సూర్‌ను తిరిగి గుత్తికి వెళ్లిపోవాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం విధుల్లో ఉన్న సమయంలోనే పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. తాము ఆస్పత్రికి వెళ్లేలోపు అతడిని రెఫర్ చేశారని, ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని వన్‌టౌన్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత ట్రాన్స్‌కో అధికారిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.