
‘ఫీజు’ కోసం కదం తొక్కిన విద్యార్థులు
అనంతపురం అర్బన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. కాదూకూడదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యార్థులు ఆందోళనకు ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకుడు రమణయ్య సంఘీభావం ప్రకటించారు. ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డితో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి కుళ్లాయిస్వామి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడదుల చేసి విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది దాటినా పీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు జమ చేయలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కేవలం ప్రకటనలకే పరిమతం చేశారంటూ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులకు పేద విద్యార్థులను దూరం చేసే జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియేట్ ఫలితాలు వెల్లడై మూడు నెలలు అవుతున్నా నేటికీ డిగ్రీ ప్రవేశాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమయాన్ని పాత విధానంలోనే కొనసాగించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలను ఆయన చాంబర్‌లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, కోశాధికారి ఆంజనేయులు, నాయకులు వెంకట్‌నాయక్, నరసింహయాదవ్, మంజునాథ్, వంశీచంద్, ఉమమహేష్, మౌళి, వినోద్, నానీ, సమీర్, రాజేష్, రాజు, పవన్, తరుణ్, బాబ్జాన్, దిలీప్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
పేద విద్యార్థుల జీవితాలతో
చెలగాటమొద్దని కూటమి సర్కార్‌కు హితవు
ఫీజు రీయింబర్స్ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక