
పేదలకు విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు
● మాజీ మంత్రి సాకే శైలజనాథ్
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో పేద పిల్లలకు విద్య దూరమవుతోందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు విద్యావ్యవస్థ అభివృద్ధికి చేసిన మంచి పని అంటూ ఏ ఒక్కటీ లేదని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అభూత కల్పన చేస్తున్న సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ జగనన్న తీసుకువచ్చిందేనన్నారు. సత్యసాయిజిల్లా కొత్త చెరువు ప్రభుత్వ హైస్కూల్‌లో తల్లిదండ్రులకు టీచర్స్ మీటింగ్‌లో పిల్లలకు పాఠాలు బోధించిన మీరు రెండు నెలల క్రితం అదే జిల్లాలో ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థినిపై మృగాళ్లు దాడి చేస్తే ఇంత వరకు బాధితురాలి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అక్కడ బాధింపబడిన కుటుంబం మీ పార్టీకి చెందిన వారే అని ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కిరాతకులు మీవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఓ బాధిత బాలికలకు భరోసా కల్పించలేని మీరు రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పిస్తారో చెప్పాలన్నారు. కుమారుడు లోకేష్ భవిష్యత్తుపై ఉన్న భరోసా పేద ప్రజలపై సీఎం చంద్రబాబుకు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి చంద్రబాబు అసమర్థ పాలనే కారణమన్నారు.