
తాగునీటి సమస్య తీర్చాలని నిరసన
కుందుర్పి: మండలంలోని బసాపురం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు సచివాలయానికి తాళం వేసి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా గ్రామానికి తాగునీరు అందడం లేదని, అధికారులను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోయారు. తాగునీరు అందించే వరకూ సచివాలయం తలుపు తీయరాదని భీష్మించారు. ఎంపీడీఓ లక్ష్మీశంకర్ స్పందించి 24గంటల్లో సమస్య పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.
రైతుల నగదు చోరీకి యత్నం
కళ్యాణదుర్గం రూరల్: ముగ్గురు రైతులకు చెందిన నగదును చోరీ చేసేందుకు ఓ అగంతకుడు విఫలయత్నం చేసిన ఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. వివరాలు.. బెళుగుప్ప మండలం విరుపాపల్లికి చెందిన రైతు గోవిందప్పతో పాటు మరో ఇద్దరు రైతులు సోమవారం కళ్యాణదుర్గంలోని యూనియన్ బ్యాంక్ శాఖకు వచ్చారు. తమ పంట రుణాలను రెన్యూవల్ చేసిన అనంతరం ఖాతాలో నుంచి రూ.6 లక్షలు విత్‌డ్రా చేసి గోవిందప్పకు అప్పగించి, మిగిలిన ఇద్దరు పనిపై వెళ్లిపోయారు. నగదును గోవిందప్ప తన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగ్‌లో ఉంచి విద్యుత్ కార్యాలయం సమీపంలోని హోటల్‌లోకి వెళ్లి భోజనం చేస్తూ తన వాహనంపై నిఘా ఉంచాడు. కాసేపటికి ఓ యువకుడు ద్విచక్ర వాహనంలోని నగదును అపహరించే ప్రయత్నం చేయగా గట్టిగా కేకలు వేయడంతో నగదు అక్కడే పడేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు.
జేఎన్‌టీయూలో
1,935 సీట్ల తగ్గింపు
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో సీట్ల ఖరారు పూర్తయింది. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో మొత్తం 69 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు గాను ఈ విద్యాసంవత్సరానికి 59,244 సీట్ల ఏఐసీటీఈ మంజూరు చేసింది. కళాశాలల నిజనిర్ధారణ కమిటీల సిఫార్సు మేరకు 1,935 సీట్లను తగ్తిస్తూ మొత్తం 57,309 ఇంజినీరింగ్ సీట్లను ఖరారు చేశారు. వీటిని ఏపీఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్ల ఎంపికకు అందుబాటులో తెచ్చేందుకు ఉన్నత విద్యామండలికి నివేదించారు. బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు సంబంధించి 77,296 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలపగా, 74,145 సీట్లను భర్తీ చేసుకునేందుకు వర్సిటీ తుది ఆమోదం తెలిపింది.