
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
అనంతపురం కార్పొరేషన్: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, గోరంట్ల మాధవ్ విలేకరులతో మాట్లాడారు. మాధవ్ మాట్లాడుతూ తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశానికి కూటమి ప్రభుత్వం డైరెక్షన్‌లో పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీకి 2019లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లు అందించి ప్రజలు ఆశీర్వదించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సమావేశాలు, సభలు, కార్యక్రమాలు నిర్వహించుకునే సౌలభ్యం కల్పించారన్నారు. కానీ అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. సమావేశం నిర్వహణకు పోలీసులు అవకాశం కల్పించాలన్నారు. గుడివాడలోనూ తమ పార్టీ నేత కొడాలి నాని కార్యక్రమానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమ విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. అలవిగాని హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి నేడు ప్రజలను మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన మేలును, కూటమి ప్రభుత్వ నయవంచనను ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ అధిష్టానం ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, కార్యక్రమంలో భాగంగానే తాడిపత్రిలో సమావేశం ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. ఈ నెల 18న ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారని ఆయన పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్