
కూటమి ప్రభుత్వ మెడలు వంచుదాం
గార్లదిన్నె: కూటమి ప్రభుత్వ మెడలు వంచైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా చూడాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం గార్లదిన్నె మండలం కల్లూరులో నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ రెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్‌తో కలిసి ముఖ్య అతిథిగా అనంత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో అవినీతికి తావు లేకుండా పాలన సాగిందన్నారు. అర్హులకు ఏకంగా రూ.2.83 వేల కోట్లు అందించామన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. గత ఎన్నికల్లో ఒక్క వైఎస్సార్‌సీపీకే 42 శాతం ఓట్లు వచ్చాయని, టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలకు కలిపి 58 శాతం ఓట్లు వచ్చా యన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో రూ.81 వేల కోట్ల బకాయి పడిందన్నారు. ‘తల్లికి వందనం’ ఒక ఏడాది కట్ చేసి, ఈ ఏడాది కొంత మందికి మాత్రమే అందించారన్నారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోనున్నాయని, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి కూటమి ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ శాఖ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో సకాలంలో ఆయకట్టుకు నీరు అందించామని, ప్రస్తుతం జూలై ముగుస్తున్నా సాగు నీరు విడుదల చేయలేదన్నారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 4 వరకూ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
చంద్రబాబు పతనం ప్రారంభం..
శింగనమల నియోజకవర్గం నుంచే చంద్రబాబు పతనం ప్రారంభమవుతుందని సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. నార్పలలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’కు అడ్డంకులు సృష్టించారని, దీంతో బస్టాండ్ సర్కిల్లో కార్యక్రమం నిర్వహించామన్నారు. వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనులు చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి కూటమి పార్టీ నాయకులు దాడులు చేస్తే వారికి బెయిలబుల్, అదే వైఎస్సార్ సీపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. రాబోయేది జగన్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కరోనా కష్ట కాలంలో కూడా వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, అనంతపురం రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, జంబులదిన్నె సొసైటీ మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కుంచం రామ్మోహన్ రెడ్డి, శింగనమల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు మంత్రి ఆంజనేయులు, బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, బుక్కరాయ సముద్రం జెడ్పీటీసీ భాస్కర్, మేధావుల ఫోరం అధ్యక్షుడు అనిల్‌కుమార్ రెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు నాగరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు చీమల శీన, చితంబరరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు వైఎస్సార్ సీపీతోనే ఉన్నారు
పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత
చంద్రబాబు పతనం ప్రారంభం: మాజీ మంత్రి శైలజానాథ్

కూటమి ప్రభుత్వ మెడలు వంచుదాం