
హత్య కేసులో నిందితుల అరెస్ట్
శింగనమల: ఇంటి రస్తా విషయంలో శింగనమల మండలం ఇరువెందలలో చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శింగనమల పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు వెల్లడించారు. ఇరువెందుల గ్రామానికి చెందిన మైలే శంకరయ్యకు వరుసకు మనవరాలైన శ్యామల ఈ నెల 3న మధ్యాహ్నం 1 గంటకు తన ఇంటికి వెనుక ఉన్న దారికి ముళ్ల కంప అడ్డు వేసింది. ఈ విషయంగా దాసరి ప్రభాకర్ భార్య సరస్వతి, తల్లి రత్నమ్మ గొడవపడ్డారు. సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకున్న ప్రభాకర్‌కు విషయాన్ని భార్య, తల్లి తెలపడంతో ఆగ్రహానికి గురైన ఆయన తన తమ్ముడు త్రినాథ్, బంధువులు రమేష్, శేఖర్, నాగేంద్ర, రామచంద్ర, శ్రీనివాసులు, సరస్వతి, రత్నమ్మతో కలసి కర్రలు, రాళ్లతో శంకరయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. శ్యామల భర్త మల్లికార్జున ఎక్కడ అంటూ దుర్భాషలాడుతుండగా శంకరయ్య నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అంతలో ప్రభాకర్‌తో పాటు త్రినాథ్, రమేష్, శేఖర్, నాగేంద్ర, రామచంద్ర, శ్రీనివాసులు, సరస్వతి, రత్నమ్మ మూకుమ్మడిగా శంకరయ్య, బాలగంగిరెడ్డి, నాగేంద్ర, అమ్ములన్న, పెద్దరాజుపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఘటనలో శంకరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం పక్కా ఆధారాలతో నాయనపల్లి క్రాస్ వద్ద ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో, సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ విజయ్‌కుమార్, ఎఎస్‌ఐ చితంబరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.