
పాలకుల అలసత్వం.. ఆటో డ్రైవర్ల శ్రమదానం
కళ్యాణదుర్గం రూరల్: ఓ బడా కాంట్రాక్టర్ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లను నిర్మిస్తానని అప్పట్లో ఆయన హామీనిచ్చారు. నియోజకవర్గ ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. 13 మాసాలు గడిచినా ఇప్పటి వరకూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడే కానీ రోడ్డు నిర్మించిన పాపాన పోలేదు. దెబ్బతిన్న రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల రహదారులు గోతుల మయమయ్యాయి. ఇక తమ ఎమ్మెల్యే స్పందించరని ఆలస్యంగా తెలుసుకున్న కొందరు యువకులు శ్రమదానంతో రోడ్డుపై గుంతలను పూడ్చే పని చేపట్టారు.
20 గ్రామాలకు వెళ్లే రహదారికి మరమ్మతులు
కళ్యాణదుర్గం నుంచి ముదిగల్లు, కోడిపల్లి, ముద్దినాయన పల్లితో పాటు సుమారు 20 గ్రామాలకు పైగా ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి పూర్తి అధ్వాన స్థితికి చేరుకుంది. ఎటు చూసిన గుంతలే కనిపిస్తుండడంతో మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు అయా గ్రామస్తులు విన్నవించారు. అయినా ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆటో డ్రైవర్లు స్పందించారు. సోమవారం పలువురు ఆటో డ్రైవర్లు ఏకమై చందాలు వేసుకుని ట్రాక్టర్‌లో కంకర్ వేస్టును తీసుకెళ్లి పట్టణ సమీపంలోని ముదిగల్లు బైపాస్ రోడ్డు నుంచి దాదాపు ఒక కిలోమీటర్ మేర రోడ్డుపై గుంతలను పూడ్చి వేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ... ఆటోల్లో ఈ మార్గంలో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలు ప్రయాణం చేస్తుంటారన్నారు. కొన్ని రోజుల క్రితం ఆటోలో గర్భిణిని ఆస్పత్రికి తరలించే సమయంలో పరిస్థితి విషమించిందని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
అతిథి అధ్యాపకుల నియామకానికి
దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని వివిధ విభాగాల్లో బోధనకు అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను చరిత్ర, ఆర్కియాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 16న ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఉదయం 10 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో వివరాలు నమోదు చేసుకోవాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రూమ్ నంబర్ 14లో ఇంటర్వ్యూలు చేపడతారు. యూజీసీ నిబంధనలు అనుసరించి భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. పీహెచ్‌డీ, నెట్, స్లెట్, పీజీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు బయోడేటా, విద్యకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాలి.
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
యల్లనూరు: మండలంలోని తిమ్మంపల్లికి చెందిన కౌలు రైతు పెద్దారెడ్డి(50) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్షుంపల్లికి చెందిన ఓ రైతు తోటను కౌలుకు తీసుకుని ఎనిమిది ఎకరాల్లో చీనీ పంట సాగు చేశాడు. ఆదివారం రాత్రి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లినా ఆయన మోటారుకు అమర్చిన విద్యుత్ తీగల కొక్కీలను తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్యాపిల్లలు అక్కడకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న పెద్దారెడ్డిని చూసి బోరున విలపించారు. కుమారుడు సాయిప్రతాపరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
బుక్కరాయసముద్రం: మండలంలోని గుత్తి రోడ్డు సమీపంలోని తడకలేరు వంకలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని బెంగళూరుకు చెందిన దేవరాజ్ (56)గా గుర్తించారు. అనంతపురానికి వచ్చిన ఆయన మూడు రోజుల క్రితం తడకలేరు వద్ద మృతి చెందినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

పాలకుల అలసత్వం.. ఆటో డ్రైవర్ల శ్రమదానం