● గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ
గుంతకల్లు టౌన్: వీఆర్‌ఓ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన మేరకు... పట్టణంలోని సోఫియా స్ట్రీట్‌లో నివాసముంటున్న షేక్ షమీమ్‌భాను తన మొదటి భర్తతో రెండేళ్ల క్రితం విడాకులు పొంది ఐదేళ్ల కుమారుడితో కలసి తల్లిదండ్రుల సంరక్షణలో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తన కుమారుడి పేరును రేషన్‌కార్డులో నమోదు చేయించేందుకు సచివాలయానికి వెళ్లిన ఆమెను వీఆర్‌ఓ మహమ్మద్ వలి మాయ మాటలతో లోబర్చుకున్నాడు. ఇంటి స్థలం, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె వద్ద రూ. లక్ష తీసుకున్నాడు. అనంతరం 2024, మే 22న అనంతపురంలో పెద్దల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. అయితే వీఆర్‌ఓకు ఇదివరకే వివాహమైన విషయాన్ని తెలుసుకున్న ఆమె నిలదీసింది. దీంతో మొదటి భార్య, ఇద్దరు బావమరుదులు షమీమ్‌భాను ఇంటికి చేరుకుని గొడవ చేసి, దుర్భాషలాడుతూ దాడికి తెగబడ్డారు.చంపేస్తామని బెదిరించారు. మహమ్మద్ వలి, ఆయన మొదటి భార్య, అతని బావమరుదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు, తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి బి.సురేష్, తదితరులతో కలసి సోమవారం వన్‌టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె మౌఖికంగానే ఫిర్యాదు చేశారని, సమగ్ర వివరాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీఐ మనోహర్ తెలిపారు.