
హింసాత్మకంగా బాబు పాలన
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో చంద్రబాబు పాలన హింసాత్మకంగా సాగుతోందని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. గురువారం మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడారు. బీకేఎస్ మండలంలోని చెన్నంపల్లిలో తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడడం పిరికపంద చర్య అన్నారు. 8 మందిపై కొడవళ్లు, గొడ్డళ్లతో దాడులకు పాల్పడడం దారుణమని, వైఎస్సార్ సీపీ పాలనలో మండలంలో ఎక్కడా దాడుల ఘటనలు జరగలేదన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనూ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. నేడు ప్రశాంతంగా ఉండే పల్లెల్లో టీడీపీ నాయకులు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం రాజకీయాలకు అతీతంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, నరేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
అనంతపురం అర్బన్: ‘సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
న్యూస్‌రీల్