సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై పీటముడి వీడటం లేదు. ఇటీవల నామమాత్రంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టిన చంద్రబాబు సర్కారు.. అనంతపురం మార్కెట్ యార్డు చైర్మన్‌గిరీని మాత్రం ఎవరికీ కట్టబెట్టలేదు. ఇదే క్రమంలో వారికీ, వీరికీ అంటూ పేర్లు లీక్ అవుతుండడంతో ‘తమ్ముళ్ల’లో అసంతృప్తి జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. చైర్మన్ రేసులో ఉన్నారంటూ తొలుత బల్లా పల్లవి పేరు తెరమీదకొచ్చింది. ఈమెను అధిష్టానం తిరస్కరించడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు కోనంకి గంగారాం పేరును పంపారు. ఈయన పేరునూ ఓకే చేయలేదు. తాజాగా నాగభూషణం పేరు వినిపిస్తోంది. ఈయన రెండేళ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఇలాంటి వ్యక్తికి చైర్మన్‌గిరీ అప్పగిస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడడంపై అసంతృప్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
టీడీపీలో అభ్యర్థులే కరువయ్యారా?
అనంతపురం టీడీపీలో 20 ఏళ్లుగా జెండా మోస్తున్న వారున్నారు. వీళ్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులిస్తారా అంటూ ‘తమ్ముళ్లు’ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కొత్త అభ్యర్థిని తెరమీదకు తెచ్చినా తామందరం కష్టపడి పనిచేశామని, నేడు నామినేటెడ్ పోస్టులనూ వెలకట్టి అమ్ముకుంటున్నారని సీనియర్ టీడీపీ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నాళ్లు జెండా మోసినా గుర్తించనప్పుడు పార్టీలో ఉండి ఏం చేయాలి అంటూ నిట్టూర్చారు.
‘స్థానిక’ ఎన్నికల వేళ గ్రూపుల గోల..
రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా అనంతపురం మార్కెట్‌కు పేరుంది. అతిపెద్ద చీనీ మార్కెట్ కూడా ఇదే. వారం వారం వేలాదిగా పశు వుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అలాంటి మార్కెట్ యార్డు చైర్మన్ పోస్టు దక్కించుకోవాలని ఎంతోమంది ఆశగా ఉంటారు. కానీ డబ్బు ఎవరు ఎక్కువగా ఇస్తే వారికే పోస్టు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొన్ని నెలల్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. చాలామంది సీనియర్లు తమకు గుర్తింపు దక్కక పోవడంతో ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే శింగనమల ఎమ్మెల్యేపై మండల స్థాయి నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. అనంతపురం అర్బన్‌లో తాజాగా రెండు గ్రూపులు అయ్యాయి. రోజూ నువ్వా నేనా అంటూ కత్తులు దూసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన ‘తొలి అడుగు–ఇంటింటికీ సుపరిపాలన’ కార్యక్రమం నామమాత్రంగా కూడా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికే కష్టమంటూ ‘తమ్ముళ్లు’ వాపోతున్నారు.
అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై పీటముడి
ఆరు మాసాలుగా కాలయాపన
పేర్ల లీక్‌తో తమ్ముళ్లలో
పెల్లుబుకుతున్న అసంతృప్తి జ్వాలలు