
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
అనంతపురం: ఇళ్లలోకి ప్రవేశించి బంగారు నగలు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న విక్కీ అలియాస్ షామీర్‌తో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న ఫరూక్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రెండో పట్టణ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీకాంత్ యాదవ్ వెల్లడించారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సలీం కుమారుడు మాదిరి కర్రి విక్కీ అలియాస్ షామీర్ (20) తన ఆరేళ్ల వయసులోనే పారిపోయి అనంతపురానికి చేరుకున్నాడు. అప్పట్లో విజయనగర కాలనీలోని అనాథ ఆశ్రమంలో ఉంటూ రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌లో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ రాత్రి సమయాల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకుని, చివరకు దొంగతనాల్లో రాటుదేలాడు. 2024, నవంబర్‌లో అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్‌లో ఉన్న ఇంట్లోకి వారం వ్యవధిలో రెండు సార్లు చొరబడి రెండు బంగారు గాజులు అపహరించాడు. అలాగే ఈ ఏడాది జూన్‌లో ఓ యమహా బైక్, గోవాలో ఐ ఫోన్, ఆపిల్ ల్యాప్‌టాప్‌ను అపహరించాడు. ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ప్రనస్నాయపల్లి రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న షామీర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వరుస చోరీలు వెలుగుచూశాయి. గతంలో చోరీ చేసిన సొత్తుతో పాటు పలు సందర్భాల్లో అపహరించిన 8 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను రికవరీ చేశారు. అలాగే నాలుగు సెల్‌ఫోన్లను కొనుగోలు చేసిన ఫరూక్ అరెస్ట్ చేసి నాలుగు సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. ఇద్దరి నుంచి రికవరీ చేసిన మొత్తం ఆరు తులాల బంగారు గాజులు, 12 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక స్కూటీ విలువ రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీసీఎస్ సీఐ వలిబాషా, జయపాల్‌రెడ్డి, టూ టౌన్ సీఐ శ్రీకాంత్‌యాదవ్, ఎస్‌ఐ రుష్యేంద్రబాబును ఎస్పీ పి.జగదీష్ అభినందించారు.
నిందితుల్లో ఒకరు గుజరాత్‌లోని సూరత్ నివాసి
ఆరేళ్ల వయసులోనే అనంతకు చేరుకున్న వైనం
రూ.12 లక్షల విలువైన సొత్తు రికవరీ