
నెల్లూరుపై కడప విజయం
అనంతపురం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడామైదానం వేదికగా అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సీనియర్ మల్టీ డే క్రికెట్ మ్యాచ్‌లో నెల్లూరుపై కడప జట్టు విజయం సాధించింది. అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్ డ్రా అయింది. వివరాలు.. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులతో బ్యాటింగ్‌కు వచ్చిన అనంతపురం జట్టు 90 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి 196 బంతుల్లో 9 సిక్సర్లు, 16 ఫోర్లతో 164 పరుగులు చేశారు. చిత్తూరు రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జట్టులో బ్యాటర్ ధ్రువ 48 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 81 పరుగులు, మరో బ్యాటర్ మోనిష్ 64 పరుగులు సాధించారు. కాగా, అనంతపురం జట్టుపై మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యత ప్రదర్శించిన చిత్తూరు జట్టుకు మూడు పాయింట్లు, అనంతపురం జట్టుకు ఒక పాయింటు దక్కింది.
రెండో మైదానంలో నెల్లూరు జట్టుతో తలపడిన కడప జట్టు 5 వికెట్లతో విజయం సాధించి ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 179 పరుగులు ఆరు వికెట్ల నష్టానికి బ్యాటింగ్ చేపట్టిన నెల్లూరు జట్టు 215 పరుగులకు ఆలౌట్ అయింది. నెల్లూరు బ్యాటర్ రేవంత్ రెడ్డి 76 పరుగులు సాధించాడు. 259 పరుగుల లక్ష్యాన్ని కడప జట్టు సునాయసంగా ఛేదించింది. కేవలం 43.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. కడప బ్యాటర్లు ధ్రువ 103 బంతుల్లో మూడు సిక్సర్లు, 10 ఫోర్లతో 101 పరుగులు చేసి విజయానికి తోడ్పాటునందించాడు. కడప బౌలర్లు శ్రీకాంత్ 5 వికెట్లు, ఆశిష్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు.
అనంతపురం, చిత్తూరు మ్యాచ్ డ్రా

నెల్లూరుపై కడప విజయం