
జన హృదయ నేత వైఎస్సార్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒక పథకం దేశం కాదు ప్రపంచం దృష్టినే ఆకర్షించడం సామాన్య విషయం కాదు. ఏకంగా ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి సంస్థలు ఆరోగ్యశ్రీని పొగిడాయంటే ఈ పథకం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. ఆరోగ్యశ్రీ.. ఈ పథకం పేరు వినగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారు. దేశవ్యాప్తంగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పథకాల రూపకర్తగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఆరోగ్యశ్రీ పురుడు పోసుకుంది అనంతలోనే
2004 సంవత్సరానికి ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా అత్యంత కరువు ప్రాంతం. పదిరూపాయలు పెట్టి వైద్యం కూడా చేయించుకోలేని దుస్థితి. ఇలాంటి సమయంలో మొదటి దశలో అనంతపురం జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడే పథకం పురుడు పోసుకుంది. అనంతపురంతో పాటు మహబూబ్‌నగర్, శ్రీకాకుళంలో ఒకేరోజు ఈ పథకాన్ని ప్రారంభించారు. 168 వ్యాధులతో ప్రారంభమైన ఈ పథకం తర్వాత 958 చికిత్సలకు వైద్యం అందించింది. ఈ పథకం ద్వారా పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందారు. పుట్టుకతోనే చెవిటి మూగ ఉన్న పిల్లలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షలు వెచ్చించి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయించిన ఘనత వైఎస్సార్‌దేనని అందరికీ తెలిసిందే.
108, 104 పథకాలు...
ఆపదలో నేనున్నానంటూ కుయ్ కుయ్‌మంటూ వచ్చే 108 వాహనాల రూపకర్తా వైఎస్సారే. ప్రమాదంలో గాయపడి నిస్సహాయ స్థితిలో ఉండే వేలాదిమందికి ఈ వాహనాలే ప్రాణభిక్ష పెట్టాయి. రాత్రనకా పగలనకా ఏ సమయంలో పిలిచినా పలికే ఈ వాహనాల పథకాన్ని వైఎస్సార్ సృష్టించారు. ఈ పథకం ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ అమలు చేశాయి. వైద్య సలహాల కోసం 104 పథకాన్నీ రూపొందించారు. 104కు ఫోన్ చేస్తే చాలు వైద్య సలహాలు అందేవి. వైఎస్సార్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్, పంట రుణాల మాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
దార్శనికుడు వైఎస్సార్
జిల్లాలో కరువు నివారణలో భాగంగా సాగు – తాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక తాగునీటి పథకంగా ఉన్న హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లోనే ఫేజ్–1కు రూ.1,305 కోట్లు, ఫేజ్–2కు రూ.1,880 కోట్లు విడుదల చేశారు. ఆయన హయాంలోనే ఫేజ్–1 పనులను పూర్తి చేశారు. ఫేజ్–2 పనులు 60శాతం మేర పూర్తి చేశారు. 2008 నుంచి ఏటా హంద్రీ–నీవా ద్వారా కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నాయి. అలాగే తుంగభద్ర ఎగువ కాలువ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాలోని కణేకల్లు వరకు కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఉంటుంది. అక్కడి నుంచి హెచ్‌ఎల్‌ఎంసీ, జీబీసీ, మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇదిలా ఉంటే ఆనాడు కరువు పరిస్థితులతో తాగునీళ్లో రామచంద్రా అనే పరిస్థితులు జిల్లాలో ఉండేవి. కిలోమీటర్ల మేర దూరంలోని వ్యవసాయబోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకునే వారు. నేడు జిల్లాలో శాశ్వతంగా తాగునీటి ఇబ్బందులు తొలగిపోయావంటే అది మహానేత వైఎస్సార్ చలవే అని చెప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీఏబీఆర్ రిజర్వాయర్ నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ఉరవకొండ నియోజకవర్గం నుంచి హిందూపురం వరకు తాగునీటిని అందించారు. అనంతపురం నగరానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారానే జిల్లాలో 60 శాతానికి పైగా జనాభాకు నేడు తాగునీటి సరఫరా జరుగుతోంది. భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పీఏబీఆర్‌కు తుంగభద్ర జలాశయం నుంచి 10 టీఎంసీలు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేశారు. తుంగభద్ర నుంచి కేసీ కెనాల్ వాటా నీటిని పోతిరెడ్డి పాడు నుంచి తీసుకుంటూ... కేసీ కెనాల్ వాటా పీఏబీఆర్‌కు మళ్లించారు. దామాషా ప్రకారం ఏటా సగటున 4 టీఎంసీలకు పైగా అదనపు జలాలు వస్తున్నాయి.
లక్షలాది మందికి పునర్జన్మనిచ్చిన ఆరోగ్యశ్రీ
అనంతరం 108, 104 పథకాలు అమల్లోకి తెచ్చిన మహానేత
కరువుతో అల్లాడుతున్న సమయంలో అనంతకు వైఎస్ ఆసరా
జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చింది వైఎస్సారే
రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో ఊరట
అద్భుత పథకాల ఆవిష్కర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేడు
జన హృదయ నేత వైఎస్సార్
ప్రజల మనిషి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన మరణించినా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. కష్ట కాలంలో రుణమాఫీతో పాటు రుణాలు సరిగా చెల్లించిన తమలాంటి వారికి చేయూతనిచ్చారు. మా కుటంబానికి రూ.లక్ష దాకా అప్పట్లో రుణ ఉపశమనం లభించింది. కృష్ణా జలాలను అందించి కరువును పారదోలారు. ప్రతి నీటి బొట్టులోనూ వైఎస్ కనిపిస్తారు.
– మేడాపురం గాండ్ల అశ్వర్థనారాయణ, చిన్నబోయనపల్లి, కొత్తచెరువు మండలం

జన హృదయ నేత వైఎస్సార్

జన హృదయ నేత వైఎస్సార్