
ఉపాధి, ఇసుకలో ‘తమ్ముళ్ల’ దోపిడీ
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే..టీడీపీ నాయకులు మాత్రం ఉపాధి హామీ పథకంలో అవినీతి, ఇసుక అక్రమ రవాణాతో రెండు చేతులా అక్రమార్జనకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ విమర్శించారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన సోమవారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ‘శ్రామికుల శ్రమ’ అని పలికే పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం తదితర ప్రాంతాల్లో ఫొటోలను మార్పులు చేసి ఉపాధి పథకంలో అవినీతికి పాల్పడ్డారంటూ అందుకు సంబంధించి ఆధారాలను మీడియాకు చూపారు. ఈ అక్రమాలను గ్రామ సర్పంచ్ ప్రశ్నిస్తే గతంలో చేసిన పనులను పెండింగ్‌లో ఉంచి టీడీపీ నాయకులు పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మస్టర్లలో లేని వారికి ఫీల్డ్ అసిస్టెంట్ల కనుసన్నల్లో డబ్బులిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. విచారణ చేస్తున్నామని బుక్కరాయసముద్రం ఎంపీడీఓ చెబుతున్నారని, అందులో ఏ మేరకు నిజాలు నిగ్గు తేలుతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఉపాధి పథకంలో జిల్లా అంతటా అవినీతి జరుగుతోందని, పాత పనులకే అడ్డగోలుగా బిల్లులు చేస్తున్నారని, వీటిపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, యల్లనూరు, రాయదుర్గం, ఉల్లికల్లు, కళ్యాణదుర్గం, శింగనమల తదితర ప్రాంతాల్లో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. చిన్న జలాలపురం, నిదనవాడలో టీడీపీ నాయకులు సవాళ్లు విసురుతూ ఇసుకను తోడేస్తున్నారన్నారు. ఇసుకను ఇలా తోడేస్తూ పోతే భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను, న్యూట్రల్ గొంతులను అణచి వేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని విమర్శించారు. మిర్చి, మొక్కజొన్న, పసుపు, వరి, పొగాకు, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆ పార్టీకి చెందిన వ్యక్తినే హత్య చేయాలని చూసినట్లు వారే చెబుతున్నారన్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం స్టాంపు డ్యూటీ కుంభకోణంలో అధికార పార్టీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారని గుర్తు చేశారు.
కలెక్టర్, ఎస్పీ ఆలోచించాలి
జిల్లాలో దళితులపై అకృత్యాలు పెరిగాయని, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని, వీటిపై కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్ ఆలోచించాల్సిన అవసరం ఉందని శైలజానాథ్ సూచించారు. ఏడుగుర్రాలపల్లిలో సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు న్యాయం జరగడం లేదన్నారు. జిల్లాలో మద్యం బెల్టుషాపు లేని ఊరంటూ లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు దాదు, నాయకులు ఉదయ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుల అక్రమాలపై విచారణ చేపట్టాలి
మాజీ మంత్రి సాకే శైలజానాథ్