
అక్కడ చదివి ఉంటే ఇక్కడ కష్టమే!
అనంతపురం: హరిత అనే విద్యార్థినికి ఏపీఈఏపీ సెట్‌లో ఎనిమిది వేల ర్యాంకు వచ్చింది. సర్టిఫికెట్ల అప్‌లోడ్‌లో నాన్ లోకల్‌గా నమోదు చేశారు. పొరపాటున నాన్‌లోకల్‌గా నమోదు చేశామని, లోకల్‌గా మార్పు చేయాలని జేఎన్‌టీయూ (అనంతపురం) హెల్ప్‌లైన్ సెంటరుకు వచ్చారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివినందున నాన్‌లోకల్ కిందకే వస్తారని, తెలంగాణలో ఇంటర్ చదివిన వారిని నాన్‌లోకల్‌గా పరిగణించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. ఈ నిబంధన వల్ల మంచి కళాశాలలో ఇంజినీరింగ్ సీటు కోల్పోవడమే కాక.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేదని తెలుసుకుని హరిత ఆవేదనతో వెనక్కి వెళ్లిపోయారు. ఇలా వేలాది మంది విద్యార్థులు తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏపీఈఏపీ సెట్–2025లో గణనీయమైన ర్యాంకులు సాధించిన వారికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిబంధనలు శాపంగా మారాయి. మంచి కళాశాలలో సీటు రాని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులను నాన్‌లోకల్‌గా పరిగణించడమే ఇందుకు కారణం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లో చదివినప్పటికీ, ఇంటర్మీడియట్ ఒక్కటి తెలంగాణలో చదివినా నాన్ లోకల్‌గా పరిగణిస్తున్నారు. దీంతో మంచి కళాశాలలో సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. నాన్ లోకల్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా వర్తించదు. ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్‌లో చదివిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది. దీంతో హైదరాబాద్‌లో ఇంటర్ చదివిన వేలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏపీ విద్యార్థులు హైదరాబాద్‌లో ఏటా 50 వేల నుంచి 70 వేల మంది దాకా ఇంటర్ పూర్తి చేస్తుండడం గమనార్హం. ఇందులో ఉమ్మడి జిల్లా విద్యార్థులు మూడు వేల మంది దాకా ఉంటున్నారు.
టాప్ 15లోపు ఉంటేనే సీటు!
నాన్‌లోకల్ కేటగిరీలోకి వస్తే మంచి కళాశాలలో సీటు పొందడం కష్టమే. ఒక కళాశాలలో వంద ఇంజినీరింగ్ సీట్లు ఉంటే 50 శాతం ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తారు. ఇందులో నాన్‌లోకల్ అభ్యర్థులు టాప్ 15లోపు ఉంటేనే సీటు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో ఇంటర్ చదివి ఏపీ ఈఏపీసెట్ రాస్తే నాన్‌లోకల్ కింద సీటు ఇస్తారు. తెలంగాణ ఈఏపీసెట్ రాసిన ఏపీ విద్యార్థులకూ అక్కడ ఇదే నిబంధన వర్తిస్తోంది. ఇటు ఆంధ్రాలోనూ.. అటు తెలంగాణలోనూ నాన్ లోకల్ కిందే పరిగణిస్తుండడంతో తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారు.
2024 వరకు ఇబ్బంది లేని పరిస్థితి
ఏపీ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని, ఉమ్మడి విద్యా వ్యవస్థ ఉండేవి. తెలంగాణలో చదివినా, ఏపీలో చదివినా లోకల్‌గానే పరిగణించేవారు. 2024 నుంచి ఈ నియమం తొలగించారు. దీంతో తెలంగాణలో చదివిన ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య ఏర్పడింది. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివించారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకుండా పోతే ఇంజినీరింగ్ చదివించడం కష్టం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఏపీలో ఇంజినీరింగ్ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేలా చూడాలని తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను ఇక్కడ నాన్ లోకల్‌గా పరిగణింపు
ఏపీఈఏపీసెట్‌లో గణనీయమైన ర్యాంకు వచ్చినా.. మంచి కళాశాలలో సీటు కష్టసాధ్యమే
ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా రాని పరిస్థితి
ఏటా 70 వేల మంది దాకా ఏపీ విద్యార్థులు హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి

అక్కడ చదివి ఉంటే ఇక్కడ కష్టమే!