
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాల్గొనే అవకాశముందని, పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న పోలీసులు యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఇందుకు సంబంధించిన నోటీసును ఆయనకు యల్లనూరు ఎస్‌ఐ రామాంజనేయులు రెడ్డి అందజేశారు. దీంతో తన ఇంట్లోనే వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. బూటకపు హమీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు.. రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తాడిపత్రిలో అధికారపార్టీ నాయకులు విచ్చలవిడిగా దొంగతనాలు, గంజాయి, మట్కా దందా జోరుగా సాగిస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలతో గత ప్రభుత్వం పేదలకు వెన్నుగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలంటే ఇప్పటికీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే ప్రజలు గుర్తుకు చేసుకుంటారన్నారు. ఏడాది కూటమి పాలనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఫలితంగా రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ విజయం ఖాయమని, సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకటేష్, భాస్కరరెడ్డి, రాజకుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తన నివాసంలోనే వైఎస్సార్‌కు
నివాళులర్పించిన కేతిరెడ్డి