
ఇరువర్గాలపై కేసు నమోదు
బొమ్మనహాళ్: మండలంలోని రెండు గ్రామాల్లో చోటు చేసుకున్న దాడులకు సంబంధించి ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు. దాడులకు కేంద్రమైన బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లి, మైలాపురం గ్రామాల్లో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్ ఎస్‌ఐలు నబీరసూల్, నాగమధు, గురుప్రసాద్‌రెడ్డితో కలసి మంగళవారం డీఎస్పీ పర్యటించారు. కొలగానహళ్లికి చెందిన అనంతరాజుపై జరిగిన దాడితో పాటు మైలాపురంలో, విజయకుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై స్థానికులతో ఆరా తీశారు. అనంతరాజుపై దాడి చేశారని ఆయన కొడుకులు, బంధువులు సోమవారం రాత్రి మైలాపురంలో తన ఇంటిపై దాడి చేశారని, ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు, కారు, ఇంట్లోని టీవీ, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని, గడ్డివామికి సైతం నిప్పు పెట్టారంటూ డీఎస్పీకి విజయ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులు వివరించారు. దాదాపు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం కలిగించారని వాపోయారు. విచారణ అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. మైలాపురంలో అనంతరాజుపై దాడికి పాల్పడిన విజయ్‌కుమార్‌రెడ్డి, లోకేష్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు, విజయకుమార్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడి, ఆస్తి నష్టం కలిగించినందుకు అనంతరా , ఆయన కొడుకులు, బంధువులు దాదాపు 38 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రెండు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.