
ప్రభుత్వాలపై కార్మికుల కన్నెర్ర
అనంతపురం అర్బన్: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని ఐక్య కార్మిక సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మికులను బానిసలుగా చేస్తున్నాయని దుమ్మెత్తి పోశారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, ఎనిమిది గంటల పని హక్కును కూటమి ప్రభుత్వం హరించే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు. బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు కదం తొక్కారు. ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలోని కృష్ణ కళామందిర్ నుంచి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, అంబేడ్కర్ విగ్రహం మీదుగా నగర పాలక సంస్థ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజారెడ్డి, నాగేంద్రకుమార్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి రమాదేవి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతిప్రసాద్, పద్మావతి మాట్లాడారు. దేశ సంపదను కొల్లగొట్టిన 29 మంది కార్పొరేట్‌లలో 28 మంది గుజరాత్ వారేనని, వారంతా నరేంద్ర మోదీకి దత్తపుత్రులని విమర్శించారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టదాయకమైన నాలుగు కార్మిక్ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఎనిమిది గంటల పనివిధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం, రాత్రి షిఫ్ట్‌ల్లోనూ మహిళలు పనిచేయాలని నిర్ణయించిందన్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి గోపాల్, వైఎస్సార్‌టీయూ నాయకులు అనిల్‌కుమార్ యాదవ్, సంపంగి రామాంజినేయులు, ప్రకాష్, రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలపై కార్మికుల కన్నెర్ర