
రైతన్నలపైనే రౌడీషీట్ తెరుస్తారా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: సీఎం చంద్రబాబు రైతు వ్యతిరేకి అని, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో రైతులపై లాఠీచార్జ్ చేసిన ఘటనతో మరోసారి బాబు వికృత రాజకీయ క్రీడ బహిర్గతమైందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రైతన్నలపైనే రౌడీషీట్ ఓపెన్ చేస్తారా చంద్రబాబూ? ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామిడికి గిట్టుబాటు ధర లేదని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన చేపడితే పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తోతాపురి మామిడి కిలో రూ.22తో కొనుగోలు చేసేలా అప్పటి సీఎం జగన్ చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చేతనైతే వైఎస్ జగన్‌తో పోటీ పడి మామిడి కిలో రూ.50 ధరతో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టండి బాబూ అని సూచించారు. అంతేకానీ రైతులపై ఆంక్షలు విధిస్తే..వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అన్నం పెట్టే రైతులను బాధపెట్టే దుర్మార్గపు పాలనను కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చారో చెప్పాలన్నారు. వైఎస్ జగన్‌తో గేమ్స్ ఆడొద్దు బాబూ.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు సాకే శివశంకర్, ఓబులేసు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సాకే శైలజానాథ్