జిల్లా అంతటా సంబరంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా సంబరంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు

Jul 9 2025 6:46 AM | Updated on Jul 9 2025 8:07 AM

-

రాజన్న విగ్రహాల వద్ద ఘన నివాళి

అన్ని ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు 

అనంతపురం కార్పొరేషన్‌: రైతు బాంధవుడు, మహానేత దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మంగళవారం జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాడవాడలా వేడుకలు నిర్వహించారు. ‘జోహార్‌ వైఎస్సార్‌’ అంటూ నివాళులర్పించారు. రక్తదానం, అన్నదానం, దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి నిర్వహించారు. మొదట వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. పార్టీ కార్యాలయ ఆవరణలోనే యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ చొరవతో 135 మంది రక్తదానం చేశారు. అనంతరం జెడ్పీ కార్యాలయ ఆవరణలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆరోగ్య శ్రీ, 108, 104, పావలా వడ్డీ తదితర పథకాలను ప్రవేశపెట్టి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచారని కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపారన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్‌ అందించి వారి జీవితాలను బాగుపరిచారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, పార్టీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు రమేష్‌గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు అశ్వర్థ నాయక్‌ పాల్గొన్నారు.

● శింగనమల నియోజకవర్గంలో మాజీ మంత్రి, పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల గుండెచప్పుడు వైఎస్సార్‌ అని, విద్య, వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారన్నారు. ఇవాళ ఎంతో మంది ఉన్నత కొలువులు సాధించారంటే అది వైఎస్సార్‌ చలువేనన్నారు. కార్యక్రమంలో మాజీ సమన్వయకర్త వీరాంజినేయులు, నాయకులు పూల ప్రసాద్‌, వంశీ గోకుల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

● కళ్యాణదుర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌లో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తలారి రంగయ్య మాట్లాడుతూ పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించేలా వైఎస్సార్‌ చర్యలు చేపట్టారన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ మంగమ్మ, మునిసిపల్‌ చైర్మన్‌ తలారి రాజ్‌కుమార్‌, పార్టీ నాయకులు తిప్పేస్వామి, ఉమామహేశ్వర్‌ నాయుడు పాల్గొన్నారు.

● రాయదుర్గంలో వైఎస్సార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

● తాడిపత్రిలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత, నాయకులు ఫయాజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

● గుంతకల్లులో నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి (వైవీఆర్‌) ఆధ్వర్యంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌ చెరగని ముద్ర వేసుకున్నారని వైవీఆర్‌ కొనియాడారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భవాని, వైస్‌ చైర్‌పర్సన్‌ నైరుతి రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వర బాబు తదితరులు పాల్గొన్నారు.

● ఉరవకొండలో వైఎస్సార్‌ సీపీ నాయకుల ఆధ్వర్యంలో రాజన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

● రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఐడీసీ మాజీ చైర్మన్‌ బుక్కచెర్ల నల్లప్పరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కురుబ నాగిరెడ్డి, గోపాల్‌ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి లింగారెడ్డి తదితరులు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

వెఎస్సార్‌ జయంతి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు రమేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు 108, 104 ఉద్యోగులకు దుస్తులు పంపిణీ చేశారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్‌ కాలనీ సమీపాన ఉన్న రాకేష్‌ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. గుత్తి ప్రభుత్వాసుపత్రికి పార్టీ జిల్లా నేత బళ్లారి రాజ్‌కుమార్‌రెడ్డి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను వితరణ చేశారు. అనేక చోట్ల రక్త, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

సేవాస్ఫూర్తి 1
1/2

సేవాస్ఫూర్తి

సేవాస్ఫూర్తి 2
2/2

సేవాస్ఫూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement